Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట

by S Gopi |

మారటోరియం సమయంలో వడ్డీ చెల్లించాల్సిన పని కూడా ఉండదు.

Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రైవేట్ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియాకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. కంపెనీ సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)కు సంబంధించిన రూ. 87,695 కోట్ల బకాయిలను ప్రస్తుతానికి ఫ్రీజ్ చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం వొడాఫోన్ ఐడియాపై ఐదేళ్ల మారటోరియంను ఆమోదించింది. ఈ నిర్ణయంతో, వొడాఫోన్ ఐడియా తక్షణం ఏజీఆర్ సంబంధిత చెల్లింపులు చేయవలసిన అవసరం లేదు. ఫ్రీజ్ చేసిన బకాయిలను 2032 నుంచి 2041 మధ్య చెల్లించేందుకు వీలుంటుంది. మారటోరియం సమయంలో వడ్డీ చెల్లించాల్సిన పని కూడా ఉండదు. దీనివల్ల కంపెనీకి అప్పులతో నిండిన బ్యాలెన్స్ షీట్, నిర్వహణ సవాళ్లను పరిష్కరించడానికి వెసులుబాటు లభిస్తుంది. మారటోరియం ముగిసిన తర్వాత, బకాయిలను 6-10 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 నాటికి ఫ్రీజ్ చేసిన ఏజీఆర్ బకాయిలను టెలికాం విభాగం తిరిగి సమీక్షిస్తుంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ప్రభుత్వ కమిటీ తీసుకుంటుంది.

వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 49 శాతం అతిపెద్ద వాటా ఉంది. బకాయిలను తిరిగి చెల్లించేలా చూడటం, టెలికాం మార్కెట్‌లో పోటీని కొనసాగించడం, 20 కోట్ల వొడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్ల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, సుప్రీంకోర్టు 2020 నాటి ఆదేశాల ప్రకారం, ఇప్పటికే నిర్ణయించిన 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు చెందిన ఏజీఆర్ బకాయిలను మాత్రం ప్రస్తుత 2025-26 నుంచి 2030-31 మధ్య చెల్లించక తప్పదు.

పతనమైన షేర్లు

ఏజీఆర్ బకాయిల విషయంలో మారటోరియం కల్పించడంతో వొడాఫోన్ ఐడియా షేర్లు రాణిస్తాయని అంచనా వేసినప్పటికీ బుధవారం ట్రేడింగ్‌లో నష్టపోయింది. మొదట 5 శాతం మేర పుంజుకుని రూ. 12.80కి చేరిన షేర్ ధర, అంచనాలకు తగిన నిర్ణయాలు రాకపోవడంతో పతనమయ్యాయి. మొత్తం ఏజీఆర్ బకాయిల్లో కొంత మొత్తాన్ని రద్దు చేయవచ్చని మదుపర్లు అంచనా వేశారు. కానీ, మారటోరియం మాత్రమే వెలువడటంతో మార్కెట్లు ముగిసే సమయానికి కంపెనీ షేర్ ధర 11.53 శాతం క్షీణించి రూ. 10.67 వద్ద ముగిసింది.

Next Story