- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LTCG: ఎల్‌టీసీజీ పన్ను రద్దు చేయండి
దీర్ఘకాలం పాటు కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లను ట్రేడర్లుగా కాకుండా, దేశ ఆర్థికవ్యవస్థకు స్థిరమైన మూలధనం అందించే భాగస్వాములుగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

దిశ, బిజినెస్ బ్యూరో: లిస్టెడ్ ఈక్విటీలపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ)ను రద్దు చేయాలని ప్రముఖ ఇన్వెస్టర్ విజయ్ కేడియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీర్ఘకాలం పాటు కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లను ట్రేడర్లుగా కాకుండా, దేశ ఆర్థికవ్యవస్థకు స్థిరమైన మూలధనం అందించే భాగస్వాములుగా చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో చేసిన పోస్టులో.. వ్యాపారాల విస్తరణ, ఉద్యోగాల సృష్టి, ఆవిష్కరణలు, దేశ ఆర్థికాభివృద్ధిలో దీర్ఘకాలిక పెట్టుబడిదారులు కీలక పాత్ర పోషిస్తారని కేడియా పేర్కొన్నారు. భారత్ ప్రపంచ స్థాయి కంపెనీలు, మౌలిక సదుపాయాలు, గ్లోబల్ ఛాంపియన్లను నిర్మించాలంటే దీర్ఘకాలిక పెట్టుబడులు అవసరమని ఆయన అన్నారు. పన్ను విధానం కూడా దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహించేలా ఉండాలని కేడియా సూచించారు.
దేశంలోని ప్రజలు బంగారం వంటి ఆస్తుల్లో కాకుండా, ఉపాధి, పన్ను ఆదాయం సృష్టించే ఉత్పాదక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కంపెనీలు ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీలు, ఉద్యోగుల ఆదాయపు పన్నులు వంటి పలు మార్గాల్లో ప్రభుత్వానికి భారీ ఆదాయం అందిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. అలాంటి పరిస్థితిలో, దీర్ఘకాలిక మూలధన లాభాలపై మళ్లీ పన్ను విధించడం పెట్టుబడిదారుల ఉత్సాహాన్ని తగ్గించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లను సంపద సృష్టిలో భాగస్వాములుగా గుర్తించి, స్వల్పకాలిక స్పెక్యులేటివ్ ట్రేడింగ్‌తో వేరు చేయాలని కేడియా సూచించారు. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎల్‌టీసీజీ 2004లో రద్దు చేశారు. ఆ తర్వాత 2018లో తిరిగి తీసుకొచ్చారు. ప్రస్తుతం రూ. 1.25 లక్షల పైబడిన దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను అమలవుతోంది.






