- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India-Venezuela: భారత్‌పై వెనిజులా సంక్షోభ ప్రభావం
ప్రస్తుతం ఆ దేశంలో రోజుకు 10-10.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరుగుతోంది. ప్రపంచ ఉత్పత్తిలో ఇది 1 శాతం వాటా మాత్రమే.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో అధికార పతనం కారణంగా కీలకమైన ప్రపంచ చమురు మార్కెట్లో మార్పులకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న వెనిజులాను తమ అధీనంలోకి తీసుకోవడం ద్వారా, అమెరికా ఇంధన రంగంలో ఆధిపత్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఒకప్పుడు వెనిజులా ప్రపంచంలోనే అత్యధికంగా రోజుకు 30 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేసేది. ఇది మొత్తం ప్రపంచ చమురు నిల్వల్లో 17 శాతానికి సమానం. కానీ, ప్రస్తుతం ఆ దేశంలో రోజుకు 10-10.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం ప్రపంచ ఉత్పత్తిలో ఇది కేవలం 1 శాతం వాటా మాత్రమే.
వెనిజులాతో భారత్ వ్యాపారం
ప్రస్తుతం వెనిజులాతో భారత్‌కు ఆర్థిక సంబంధాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆంక్షలు, విధాన మార్పుల కారణంగా గత కొన్నేళ్లుగా వాణిజ్యం గణనీయంగా క్షీణించింది. కాబట్టి వెనిజులా ఇప్పుడు భారత్‌కు పెద్ద వాణిజ్య భాగస్వామి కాదు.
చమురు దిగుమతుల సంగతేంటి?
గతంలో భారత్ వెనిజులా నుంచి ఎక్కువ చమురును కొనుగోలు చేసేది, కానీ ఇటీవలి డేటా ప్రకారం వెనిజులా నుంచి చమురు దిగుమతులు గతంతో పోలిస్తే 2025లో 80 శాతం కంటే ఎక్కువ తగ్గాయి. దీనర్థం భారత్ ఇప్పుడు వెనిజులా నుంచి చాలా తక్కువ చమురును కొనుగోలు చేస్తోంది.
భారత్‌పై ఆర్థిక ప్రభావం
వాణిజ్యం, చమురు సంబంధాలు ఇప్పుడు తక్కువగా ఉండటం, క్రమంగా క్షీణిస్తున్నందున భారత ఆర్థికవ్యవస్థ, ఇంధన భద్రత వెనిజులా సమస్యల వల్ల తీవ్రంగా దెబ్బతినే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
స్టాక్ మార్కెట్‌పైనా
ప్రత్యక్ష ఆర్థిక సంబంధాలు తక్కువే అయినప్పటికీ భారత స్టాక్ మార్కెట్ గ్లోబల్ పరిణామాల ఆధారంగా ర్యాలీ అవుతుంది. వెనిజులాలో జరిగే పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలను ప్రభావితం చేస్తాయి. భారత్ తన ఇంధన వినియోగంలో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది కాబట్టి చమురు ధరల ప్రభావం నేరుగా భారత్‌పై పడుతుంది.
చమురు ధరలు పెరిగితే
వెనిజులాలో పరిస్థితుల వల్ల ప్రపంచ చమురు ధరలు పెరిగితే, అది భారత్‌లో ఇంధన ఖర్చులను పెంచవచ్చు. ద్రవ్యోల్బణం పెరగవచ్చు. ఇప్పటికే రికార్డు పతనాన్ని చూస్తున్న భారత కరెన్సీ రూపాయిపై మరింత ఒత్తిడి ఉండవచ్చు. ఈ పరిణామాలు పెట్టుబడిదారుల్లో మరింత ఆందోళనను కలిగిస్తాయి. మొత్తంగా స్టాక్ మార్కెట్ల ర్యాలీకి ప్రతికూలంగా ఉండనుంది.
అయితే, స్టాక్ మార్కెట్లలో ఇంధన కంపెనీలు, చమురు శుద్ధి చేసే, పంపిణీ స్టాక్స్ ఒడిదుడుకులను ఎదుర్కొనవచ్చు. చమురు ధరలు పెరిగితే, ఆయా కంపెనీల లాభాలు మారుతాయి, పెట్టుబడిదారులు ఈ స్టాక్‌లను కొనుగోలు చేయయడం లేదా విక్రయిస్తారు.
భారత మార్కెట్లపై మొత్తం ప్రభావం
చమురు, ఇంధనం కాకుండా అనేక రంగాల్లో వెనిజులా సంక్షోభం భారత్‌పై ప్రభావం పరిమితంగా లేదా పరోక్షంగా ఉండనుంది. ముఖ్యంగా స్వల్పకాలానికి మార్కెట్ ర్యాలీ నెమ్మదించవచ్చు. కానీ ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ, దేశంలోని ప్రధాన మార్కెట్లపై ప్రభావం నామమాత్రమంగా ఉంటుంది.
బంగారం, వెండి ధరలపైనా ఒత్తిడి
భౌగోళిక రాజకీయ సంక్షోభాలు పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేస్తాయి కాబట్టి, బంగారం, వెండి, రాగి, ముడి చమురు, గ్యాసోలిన్ వంటి కమొడిటీ మార్కెట్లు అస్థిరతను చూడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉన్నప్పుడు మదుపర్లు బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా కొనుగోలు చేయడం మొదలు పెడతారు. ఇది వాటి ధరలను పెంచవచ్చు.
ప్రస్తుతం భారత చమురు దిగుమతులు
2025, నవంబర్‌లో ప్రపంచ రాజకీయాలు, అమెరికా వాణిజ్య ఒత్తిడి వల్ల మనదేశ ఇంధన కొనుగోళ్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా భారత చమురు దిగుమతుల్లో కీలక మార్పులు జరిగాయి. అయినప్పటికీ, భారత్ ఎక్కువ మొత్తంలో రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇది రష్యాను ప్రధాన చమురు సరఫరాదారులలో ఒకటిగా చేసింది. దిగుమతులు కొన్నిసార్లు రోజుకు 15–18 లక్షల బ్యారెళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో, అమెరికా నుంచి కూడా ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. 2025 చివరిలో అమెరికా చమురు దిగుమతులు 2021 తర్వాత గరిష్ఠ స్థాయికి చేరాయి. ఇది దేశ చమురు వనరులను వైవిధ్యపరచడంలో సహాయపడింది.
ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ పెద్ద మొత్తంలో డిస్కౌంట్‌కు రష్యా చమురును దిగుమతి చేసుకోవడంతో అమెరికా భారత ఎగుమతులపై భారీ సుంకాలను విధించింది. ట్రంప్ ప్రభుత్వం భారతీయ వస్తువులపై సుంకాలను 50 శాతం వరకు పెంచింది. ఈ అధిక టారిఫ్ భారత్-యూఎస్ మధ్య వాణిజ్య చర్చలనూ క్లిష్టతరం చేసింది.
అయితే, భారత ఇంధన భద్రత, వాణిజ్య దౌత్యాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తోంది. రష్యా ముడి చమురు మొత్తం దిగుమతుల్లో ప్రధాన భాగంగా ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ సవాళ్లను తగ్గించడానికి, ఒకే దేశంపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ తన దిగుమతులను విస్తరించింది. అమెరికా, ఇతర ప్రపంచ చమురు సరఫరాదారుల నుంచి ఎక్కువ కొనుగోలు చేయడం ప్రారంభించింది.






