Festival Season: ఈ పండుగ సీజన్‌కు రూ. 2.19 లక్షలు ఖర్చు చేయనున్న అర్బన్ ఇండియా

by S Gopi |

37 శాతం మంది ఈ పండుగ సీజన్ సమయంలో ఇంటి అవసరాలకు అవసరమైన వాటికే ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు.

Festival Season: ఈ పండుగ సీజన్‌కు రూ. 2.19 లక్షలు ఖర్చు చేయనున్న అర్బన్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా పండుగ సీజన్ మొదలైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్లలో కోత విధించడంతో అనేక రకాల వస్తువులను చౌకగా మారాయి. దీనివల్ల బంపర్ షాపింగ్, అధిక వినియోగదారుల ఖర్చును ప్రోత్సహించే అవకాశం ఉంది. తాజాగా లోకల్‌సర్కిల్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాబోయే పండుగ సీజన్ సమయంలో దేశంలోని పట్టణాల ప్రజలు సుమారు రూ. 2.19 లక్షల కోట్లు ఖర్చు చేస్తారని అంచనా. ఇది వినియోగదారుల సెంటిమెంట్‌లో బలమైన పునరుద్ధరణను ప్రతిబింబిస్తుంది. దేశవ్యాప్తంగా 319 జిల్లాల్లో 44,000 కంటే ఎక్కువ పట్టణాల నుంచి 2,00,000 కంటే ఎక్కువమంది నుంచి సేకరించిన సర్వే.. భారతీయులు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్‌పై తగ్గబోయే ధరలను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 37 శాతం మంది ఈ పండుగ సీజన్ సమయంలో ఇంటి అవసరాలకు అవసరమైన వాటికే ఎక్కువ ఖర్చు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా ఫర్నిచర్, గృహోపకరణాలు, గృహాలంకరణ కోసం ఖర్చు చేస్తామని చెప్పారు. వీటి తర్వాత దుస్తులు, పాదరక్షల కోసం ఎక్కువ ఖర్చు చేస్తామని 24 శాతం మంది చెప్పారు. అలాగే, ఎలక్ట్రానిక్స్, ఇందులోనూ స్మార్ట్‌ఫోన్‌లు, ఇంట్లో ఉపయోగించే ఎంటర్‌టైన్‌మెంట్ ఉత్పత్తులు కొనాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ ముఖ్యంగా టైర్-1, మెట్రో నగరాల్లోని ప్రజలే ఎక్కువగా ఖర్చు చేస్తారని లోకల్‌సర్కిల్స్ తెలిపింది. టైర్2, టైర్3 నగరాల్లోని ప్రజలు ప్రణాళికబద్ధంగా అవసరమైన మేరకే ఖర్చు చేస్తామని చెప్పారు.

నగదు వర్సెస్ డిజిటల్ చెల్లింపులు

సర్వేలో పాల్గొన్న అర్బన్ ఇండియాలో దాదాపు 59 శాతం మంది తమ పండుగ కొనుగోళ్లకు యూపీఐ, క్రెడిట్ కార్డులు లేదా మొబైల్ వాలెట్లు వంటి డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఉపయోగిస్తామని చెప్పారు. మొత్తం ఖర్చులో నగదు చెల్లింపులు దాదాపు 35 శాతం ఉంటాయని భావిస్తున్నారు. ఈ మార్పు డిజిటల్ లావాదేవీలతో పెరుగుతున్న సౌకర్యాన్ని హైలైట్ చేస్తుంది. పండుగ సీజన్‌ సమయంలో పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లు మరింత మెరుగైన సేవలందించడం, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ సంవత్సరం దాదాపు 62 శాతం పట్టణ కుటుంబాలు తమ ఆర్థిక పరిస్థితి గురించి సానుకూలంగా ఉన్నామని చెప్పినట్టు నివేదిక తెలిపింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం, జీఎస్టీ రేటు తగ్గింపు, స్థిరమైన వడ్డీ రేట్లు లాంటి అంశాలు ఇందుకు దోహహపడ్డాయి.

Next Story