UPI: ఆగష్టులో రోజుకు సగటున రూ. 90 వేల కోట్ల యూపీఐ లావాదేవీలు

by S Gopi |

ఈ ఏడాది జనవరిలో సగటున రోజువారీ లావాదేవీల విలువ రూ. 75,743 కోట్లు ఉండగా, జూలై నాటికి రూ. 80,919 కోట్లకు పెరిగాయి.

UPI: ఆగష్టులో రోజుకు సగటున రూ. 90 వేల కోట్ల యూపీఐ లావాదేవీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ లావాదేవీలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. 2025లో ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలు విలువ పరంగానే కాకుండా వాల్యూమ్‌లోనూ భారీగా పెరిగాయని ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఈ ఏడాది జనవరిలో సగటున రోజువారీ లావాదేవీల విలువ రూ. 75,743 కోట్లు ఉండగా, జూలై నాటికి రూ. 80,919 కోట్లకు పెరిగాయి. అక్కడి నుంచి ఆగష్టులో ఇప్పటివరకు మరింత వేగవంతంగా పెరిగి రోజుకు సగటున రూ. 90,446 కోట్లకు చేరాయని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. తక్కువ మొత్తం నుంచి అధిక విలువైన లావాదేవీల వరకు దేశవ్యాప్తంగా ప్రజలు చెల్లింపుల కోసం యూపీఐపైనే ఆధారపడుతున్నారని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) మొదటిసారిగా రాష్ట్రాల వారీ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, జూలై నెలలో 9.8 శాతం వాటాతో మహారాష్ట్ర యూపీఐ వినియోగంలో అగ్రస్థానం సొంతం చేసుకుంది. ఆ తర్వాత కర్ణాటక 5.5 శాతంతో రెండో ర్యాంకు, యూపీ 5.3 శాతంతో మూడో స్థానం దక్కించుకుంది. ఆసక్తికరంగా యూపీఐ లావాదేవీల వినియోగంలో తొలి మూడు స్థానాల్లో స్థానం దక్కించుకున్న ఏకైక ఉత్తరాది రాష్ట్రం యూపీనే కావడం గమనార్హం.

Next Story