ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్స్.. ఒక్కరోజే రూ.లక్షకోట్ల చెల్లింపులు

by Naga Rani Yarlagadda |

ఈసారి దీపావళికి జీఎస్టీ కూడా తగ్గడంతో.. వినియోగదారులు ఉత్సాహంగా వస్తువులు, బైక్స్, కార్లు వగైరాలను కొనుగోలు చేశారు.

ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్స్.. ఒక్కరోజే రూ.లక్షకోట్ల చెల్లింపులు
X

దిశ, వెబ్‌డెస్క్: దీపావళి ధమాకా పేరుతో చాలా వస్తువులపై ఆఫర్ సేల్స్ రన్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే. ఈసారి దీపావళికి జీఎస్టీ కూడా తగ్గడంతో.. వినియోగదారులు ఉత్సాహంగా వస్తువులు, బైక్స్, కార్లు వగైరాలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐ సరికొత్త చరిత్ర సృష్టించింది. అక్టోబర్ 18న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 75.4 కోట్ల లావాదేవీలు జరగ్గా.. ఆ లావాదేవీల విలువ రూ.1.02 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ రికార్డుకు ప్రధాన కారణం.. జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గడమేనని ఆమె పేర్కొన్నారు.

ధన్ తేరస్ నుంచి దీపావళి వరకూ అంటే అక్టోబర్ 18,19,20 తేదీల్లో రోజుకు సగటున 73.69 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా.. ఈ ఏడాది నవరాత్రుల నుంచి దీపావళి వరకూ సేల్స్ ఏకంగా రూ.6.05 లక్షల కోట్లకు చేరింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు సామాన్యులకు ఎంతో మేలు చేసిందని, వస్తు, సేవల పన్ను 2.0 అమలుతో దేశ వృద్ధికి కొత్త ఊపు వచ్చిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) కూడా దీపావళి అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాయని పేర్కొంది. 2024లో ఇదే సమయంలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 25 శాతం అధికమని తెలిపింది.

Next Story