Apple: త్వరలో యాపిల్ డిజిటల్ చెల్లింపుల సేవలు ప్రారంభం

by S Gopi |

యాపిల్ పేని భారత్‌లో ప్రారంభించేందుకు యాపిల్ కంపెనీ బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు, ఎన్‌పీసీఐ, ఆర్‌బీఐతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

Apple: త్వరలో యాపిల్ డిజిటల్ చెల్లింపుల సేవలు ప్రారంభం
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ చెల్లింపులకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ప్రధానంగా యూపీఐ లాంటి డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ కారణంగా లావాదేవీలు అత్యంత సులభంగా, త్వరగా జరుగుతున్నాయి. అయితే, ఈ విభాగంలో దేశీయంగా ఇప్పటికీ గూగుల్, మెటా, అమెజాన్ లాంటి గ్లోబల్ కంపెనీలు, ఫోన్‌పే, పేటీఎమ్, భారత్‌పే లాంటి దేశీయ చెల్లింపుల యాప్‌ల హవా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో గ్లోబల్ టెక్ దిగ్గజం, ఐఫోన్ బ్రాండ్‌కు చెందిన యాపిల్ కూడా భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) తరహాలోనే ఇతర కంపెనీల కంటే బాగా ఆలస్యంగా ఇందులోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతానికి యాపిల్ పేని భారత్‌లో ప్రారంభించేందుకు యాపిల్ కంపెనీ బ్యాంకులు, క్రెడిట్ కార్డు కంపెనీలు, ఎన్‌పీసీఐ, ఆర్‌బీఐతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. యాపిల్ పే మొదట డెబిట్, క్రెడిట్ కార్డులకు అనుమతించాలని భావిస్తోంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత యూపీఐ చెల్లింపులను యాడ్ చేసే అవకాశం ఉంది. అన్ని ప్రక్రియలు విజయవంతమైతే ఈ ఏడాది ఆఖరు నాటికి డిజిటల్ చెల్లింపుల సేవలను ప్రారంభించవచ్చని తెలుస్తోంది.

Next Story