Union Budget: ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్

by S Gopi |

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

Union Budget: ఫిబ్రవరి 1 కేంద్ర బడ్జెట్
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 28 నుంచి మొదలుకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, తొలుత జనవరి 29న ఆర్థిక సర్వేను, ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్‌ ప్రకటన ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌ను ఆదివారం నాడు ప్రవేశపెట్టడం ఇది రెండోసారి. గతంలో 1999 ఫిబ్రవరి 28న అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 1999–2000 సంవత్సరానికి బడ్జెట్‌ను ఆదివారం రోజే ప్రవేశపెట్టారు.

ప్రత్యక్ష పన్నుల దృష్టి

2026 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న తరుణంలో, ఆదాయపు పన్ను మార్పులుపై అందరి దృష్టి ఉంది. అయితే, గతేడాది బడ్జెట్‌ల్ పన్ను శ్లాబ్‌లను సవరించడం ద్వారా పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం లభించింది. దీనివల్ల రూ. 12 లక్షల వరకు ఆదాయానికి మినహాయింపు లభించింది. దీనివల్ల, 2026 బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై పెద్దగా అంచనాలు లేవని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జీఎస్టీ పన్ను తగ్గింపు నిర్ణయాలు వినియోగదారుల ఖర్చులను తగ్గించాయి. కాబట్టి ప్రభుత్వం ఆదాయపు పన్ను రేట్లను మరింత తగ్గించే అవకాశం లేదని నిపుణులు తెలిపారు. అయితే, ప్రామాణిక తగ్గింపులో స్వల్ప పెరుగుదల వంటి చిన్న మార్పు ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి అవకాశం ఉందని వారంటున్నారు. పాత పన్ను విధానంలో కొన్ని తగ్గింపులను కూడా సమీక్షించవచ్చు.

అయితే, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ఆదివారం రానుండటంతో అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే, పెట్టుబడిదారులు సాధారణ ట్రేడింగ్ రోజు మాదిరిగా, స్టాక్‌లను కొనుగోలు చేయడం లేదా అమ్మడానికి ఒక రోజు సమయం ఉంటుంది. మార్కెట్ సెలవు కావడంతో పెట్టుబడిదారులు, విశ్లేషకులు, సంస్థలకు బడ్జెట్‌ను వివరంగా అధ్యయనం చేయడానికి అదనపు సమయం ఉంటుంది. పన్ను మార్పులు, వ్యయ ప్రణాళికలు, పాలసీ నిర్ణయాలను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story