Trump Tariff: భారత్‌పై ట్రంప్‌ సుంకాల భారం.. అదనంగా మరో 25 శాతం

by S Gopi |

అంతకుముందు రోజే డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి అక్కసు వెళ్లగక్కుతూ భారీ టారిఫ్ విధిస్తానన్నారు.

Trump Tariff: భారత్‌పై ట్రంప్‌ సుంకాల భారం.. అదనంగా మరో 25 శాతం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రభుత్వానికి మరో షాకిచ్చారు. ఇప్పటికే భారత దిగుమతులన్నింటిపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన ట్రంప్, బుధవారం అదనంగా మరో 25 శాతం టారిఫ్ విధిస్తూ కొత్త ఉత్తర్వుపై సంతకం చేశారు. రష్యాతో భారత చమురు వ్యాపారం కొనసాగడం అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ, ఈ ఉత్తర్వు ఉక్రెయిన్ వివాదంతో ముడిపడి ఉన్న చర్యల ఆధారంగా రూపొందించినట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్‌పై అమెరికా సుంకాలు మొత్తంగా 50 శాతానికి పెరిగింది. అంతకుముందు రోజే డొనాల్డ్ ట్రంప్ రష్యా చమురు కొనుగోలుకు సంబంధించి అక్కసు వెళ్లగక్కుతూ మరో 24 గంటల్లో భారీ టారిఫ్ విధిస్తానని వెల్లడించారు. అన్నట్టుగా బుధవారం సుంకాలను డబుల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, అదనంగా విధించిన 25 శాతం సుంకాలు ఉత్తర్వుపై సంతం చేసిన 21 రోజుల తర్వాత అమల్లోకి వస్తుందని వైట్‌హౌస్ తెలిపింది. అంటే ఆగష్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమలు కానున్నాయి. అంతేకాకుండా ఒకవేళ ట్రంప్ టారిఫ్‌కు ప్రతీకారంగా భారత్ కూడా సుంకాలను విధిస్తే, అధ్యక్షుడు వాటిని సవరించవచ్చని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.

స్పందించిన భారత్

సుంకాన్ని 50 శాతానికి పెంచాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి బుధవారం భారత్ ప్రతిస్పందించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం 'అనుచితం, అన్యాయం, అసమంజసమని ఎంఈఏ విమర్శించింది. భారత దిగుమతులు మార్కెట్ ఆధారంగా జరుగుతాయని, దేశంలోని 140 కోట్ల ప్రజల ఇంధన భద్రత లక్ష్యంతో చేశామని, దీనిపై ఇప్పటికే మా వైఖరిని స్పష్టం చేసామని పేర్కొంది. అలాగే, ఇతర దేశాలు తమ స్వంత జాతీయ ప్రయోజనాల కోసం తీసుకుంటున్న చర్యల తరహాలోనే భారత నిర్ణయాలపై అదనపు సుంకాలను విధించాలని అమెరికా ఎంచుకోవడం చాలా దురదృష్టకరమని ఎంఈఏ పేర్కొంది.

ఇది 'ఆర్థిక బ్లాక్‌మెయిల్': రాహుల్ గాంధీ

తాజా పరిణామాలపైపై స్పందించిన ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రధాని నరేంద్ర మోడీ మిత్రుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై 50 శాతం సుంకం విధించారు. ట్రంప్‌ ఎప్పటికప్పుడు మన దేశంపై సుంకాల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నా.. ప్రధాని మోడీ మాత్రం కనీసం ఆయన పేరు ప్రస్తావించేందుకైనా ముందుకు రావడంలేదని విమర్శలు చేసింది. దీనిపై సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 25 శాతం అదనపు సుంకాన్ని 'ఆర్థిక బ్లాక్‌మెయిల్' గా అభివర్ణించారు. ఇది అన్యాయమైన వాణిజ్య కోసం భారత్‌ను బెదిరించే ప్రయత్నమని, ప్రధాని మోడీ ఆయన బలహీనతల కోసం భారత ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని అన్నారు.

Next Story