EVs: సగానికి పైగా ఈవీ మార్కెట్ వాటా మూడు కంపెనీలదే

by S Gopi |

ఈవీ రంగం ప్రారంభ దశలో ఉన్నప్పుడు చిన్న స్టార్టప్ బ్రాండ్‌లు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ముందంజలో ఉన్నాయి.

EVs: సగానికి పైగా ఈవీ మార్కెట్ వాటా మూడు కంపెనీలదే
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) రంగంలో దేశీయ టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్ వంటి సాంప్రదాయ దిగ్గజ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ కంపెనీలు దేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్, బైక్ మార్కెట్‌లో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వీటి ముందు కొత్త స్టార్టప్ కంపెనీలు ఈ మాత్రం సత్తా చాటడంలేదు. ఈవీ రంగం ప్రారంభ దశలో ఉన్నప్పుడు చిన్న స్టార్టప్ బ్రాండ్‌లు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో ముందంజలో ఉన్నాయి. కానీ గతేడాది కంపెనీలన్నీ ఈవీ విభాగంలో కొత్త బైక్, స్కూటర్లను తీసుకురావడం, కస్టమర్ల నుంచి నమ్మకాన్ని పొందడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున అమ్మకాలను సాధించాయి. 2023లో టీవీఎస్, బజాజ్, హీరో కంపెనీల వాటా కేవలం 34 శాతం మాత్రమే ఉండేది. ఆ సమయంలో ఓలా, ఏథర్ లాంటి కంపెనీలు అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే, ఆలస్యంగా ఈవీ విభాగంలోకి వచ్చినప్పటికీ ఈ మూడు కంపెనీలు తమ పెట్టుబడుల సామర్థ్యం, నెట్‌వర్క్, తొందరగా కొత్త మోడల్స్‌ను తీసుకురావడం ద్వారా తక్కువ సమయంలోనే మార్కెట్ వాటాను సొంతం చేసుకున్నాయి. అధికారిక వివరాల ప్రకారం, ఈ ఏడాది జనవరి నాటికి టీవీఎస్ 28 శాతం, బజాజ్ ఆటో 21 శాతం, ఏథర్ 18 శాతం, హీరో మోటోకార్ప్ 11 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈవీలు కొత్తగా వచ్చిన సమయంలో 35 శాతానికి పైగా వాటా ఉన్న ఓలా ప్రస్తుతం 6 శాతానికి పడిపోయింది.

Next Story