JP Morgan: టారిఫ్ నిర్ణయంతో ట్రంప్‌కు ఎదురుదెబ్బ

by S Gopi |

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ అమలు అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అమెరికాను మాంద్యంలోకి నెట్టివేయవచ్చని అన్నారు.

JP Morgan: టారిఫ్ నిర్ణయంతో ట్రంప్‌కు ఎదురుదెబ్బ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫ్ నిర్ణయంపై ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు, నిపుణులు ఈ నిర్ణయం సరైంది కాదని, ప్రపంచ వాణిజ్యాన్నే కాకుండా అమెరికా భవిష్యత్తును కూడా దెబ్బతీయవచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తాజాగా జేపీ మోర్గాన్ సీఈఓ జామీ డిమోన్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఒకవిధంగా ఇది ఆందోళన కలిగించే నిర్ణయమని అభిప్రాయపడ్డారు. వాటాదారులకు రాసిన వార్షిక లేఖలో జామీ డిమోన్.. డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ అమలు అధిక ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. అమెరికాను మాంద్యంలోకి నెట్టివేయవచ్చని అన్నారు. సుంకాలు విధించడం వల్ల అన్ని రకాల ధరలు పెరిగేందుకు దోహదం చేయనున్నాయి. దిగుమతి చేసుకున్న వస్తువుల అధిక ధరలు వినియోగదారులను ప్రభావితం చేస్తాయి. స్థానిక ఉత్పత్తులకు డిమాంద్ పెరగడం మూలంగా వాటి ధరలు కూడా పెరుగుతాయని డిమోన్ వివరించారు. ఫలితంగా వ్యాపారాలపైనే కాకుండా సామాన్యులపైనా ప్రభావం ఉంటుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, నిరంతర అధిక ద్రవ్యోల్బణం, అధిక ఆర్థిక లోటు, పెరుగుతున్న ఆస్తుల ధరలు మరింత అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు ఇస్తున్నాయని తెలిపారు.

మాంద్యం రాకున్నా వృద్ధి కష్టమే

పూర్తిస్థాయి అమెరికా మాంద్యం చూడకపోయినా, సుంకాల ప్రభావం వల్ల ఆర్థికవ్యవస్థ మరింత నెమ్మదించే అవకాశాలు ఉన్నాయని జామీ డిమోన్ అభిప్రాయపడ్డారు. ఖర్చులు పెరిగేకొద్దీ, కంపెనీలు ఆ ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేస్తాయి, ఇది స్థానికంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. స్వల్పకాలానికి దిగుమతి చేసుకున్న వస్తువులపై మాత్రమే కాకుండా దేశీయ ధరలపైనా ద్రవ్యోల్బణ ఫలితాలు తప్పవు. ఎందుకంటే ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం, దేశీయ ఉత్పత్తిపై డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. ఈ పరిణామాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని, రానున్న నెలల్లో మరింత మార్కెట్ ఒడిదుడుకులకు అవకాశం ఉందని అన్నారు.

అంతకుముందు, ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ కూడా.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్‌ నిర్ణయం ఊహించిన దానికంటే ఎక్కువ ప్రభావితం చేయవచ్చు. అవి ద్రవ్యోల్బణం, తక్కువ ఆర్థిక వృద్ధికి దారితీసే అవకాశం ఉందన్నారు.

భారత్‌తో వాణిజ్య సంబంధాలు ముఖ్యం

సుంకాల వల్ల ఎదురయ్యే ఆర్థిక ప్రభావంపై హెచ్చరికతో పాటు, జామీ డిమోన్ అమెరికా ప్రభుత్వానికి కీలక సూచన కూడా చేశారు. ప్రస్తుత పరిణామాల మధ్య తమ పక్షం వహించాలని ఒత్తిడి చేయడం కంటే భారత్, బ్రెజిల్ వంటి దేశాలతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోవడం అమెరికా తీసుకునే తెలివైన నిర్ణయమని అన్నారు.

అలీన దేశాలతో, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి అమెరికా కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది యూఎస్‌కు మరింత స్థిరమైన వాణిజ్య సంబంధాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఇప్పటికే వాణిజ్య సంబంధాలు తెగిపోయిన దేశాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. యూఎస్‌కి ప్రస్తుతం తన సన్నిహిత భాగస్వామ్య దేశాలతో కూడా సరైన వాణిజ్య ఒప్పందాలు లేవని డిమోన్ తెలిపారు. ఈ సమయంలో స్నేహ హస్తం ఇవ్వడం ద్వారా భారత్, బ్రెజిల్ వంటి దేశాలను అమెరికాకు మరింత దగ్గర చేయగలదని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి ట్రంప్ ప్రకటనలో భారత్‌పై 26 శాతం, బ్రెజిల్‌పై 10 శాతం టారిఫ్‌లను ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story