ట్రంప్ వార్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. దలాల్ స్ట్రీట్ అతలాకుతలం!

by Ramesh Naini |   (  Updated:2026-07-08 10:30:15  IST  )

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (జూలై 8) భారీ పతనాన్ని చవి చూశాయి.

ట్రంప్ వార్ ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. దలాల్ స్ట్రీట్ అతలాకుతలం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (జూలై 8) భారీ పతనాన్ని చవి చూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో దలాల్ స్ట్రీట్ అతలాకుతలమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ ఏకంగా 1,677 పాయింట్లు నష్టపోగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 516 పాయింట్లు కోల్పోయి 24,000 కీలక మార్కు దిగువన ముగిసింది. గత రెండు నెలల కాలంలో భారతీయ మార్కెట్లకు ఇదే అత్యంత ఘోరమైన రోజు కావడం గమనార్హం.

మార్కెట్ల పతనానికి 4 ముఖ్య కారణాలు..

జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పరస్పర దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌తో శాంతి ఒప్పందం ముగిసిపోయిందని (Over) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్‌ను పూర్తిగా దెబ్బతీసింది.

భగ్గుమన్న క్రూడాయిల్ ధరలు..

ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగి బ్యారెల్‌కు 78 - 79 డాలర్ల స్థాయికి చేరాయి. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌కు ఇది కోలుకోలేని దెబ్బ.

రికార్డు స్థాయిలో పడిపోయిన రూపాయి

అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మరో 20 పైసలు క్షీణించి, రికార్డు స్థాయిలో 95.16 వద్దకు పడిపోయింది. ఆసియా మార్కెట్లయిన జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పిలతో పాటు అంతకుముందు రోజు అమెరికా మార్కెట్లు కూడా నష్టాల్లో ముగియడం దేశీయ సూచీలపై ప్రభావం చూపింది.

తీవ్ర ఒత్తిడిలో కీలక రంగాలు..

ముడిచమురు ధరల పెరుగుదల ప్రభావంతో పెయింట్ కంపెనీలు, ఎయిర్‌లైన్స్, ఆటోమొబైల్, ఆయిల్ మార్కెటింగ్ రంగాల షేర్లు కుప్పకూలాయి. ఏషియన్ పెయింట్స్, ఇండిగో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్ వంటి దిగ్గజాల షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. అన్ని ప్రధాన రంగాలు రెడ్ మార్క్‌లోనే ముగియగా.. సన్ ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్ వంటి కొన్ని షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా మార్కెట్లలో తక్షణ భయాందోళనలు (Knee-jerk reaction) నెలకొన్నాయని, రాబోయే కొన్ని సెషన్లలో ఇన్వెస్టర్లు ఇరాన్ వివాదాన్ని, దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలను నిశితంగా గమనించాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Next Story