Reciprocal Tariff: ట్రంప్ టారిఫ్‌తో తీవ్రంగా ప్రభావితం కానున్న భారతీయ ఫార్మా రంగం

by S Gopi |   (  Updated:2025-03-09 15:58:37  IST  )

భారత ఫార్మా కంపెనీలకు అధిక ఉత్పత్తు ఖర్చులతో పాటు ఇతర దేశాల ఉత్పత్తులతో తక్కువ పోటీ పరిస్థితులు ఏర్పడనున్నాయి.

Reciprocal Tariff: ట్రంప్ టారిఫ్‌తో తీవ్రంగా ప్రభావితం కానున్న భారతీయ ఫార్మా రంగం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ నుంచి భారత ఉత్పత్తులపై ప్రతీకార పన్నులను విధించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో దేశీయంగా అనేక ఎగుమతి రంగాల్లోని పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సుంకాలు పెరిగితే అమెరికాలో భారత ఫార్మా దిగుమతులు మిగిలిన వాటికంటే ఎక్కువ ప్రభావం ఎదుర్కొంటాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారత ఫార్మా కంపెనీలకు అధిక ఉత్పత్తు ఖర్చులతో పాటు ఇతర దేశాల ఉత్పత్తులతో తక్కువ పోటీ పరిస్థితులు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా చిన్న ఔషధ సంస్థలు ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని, ఫలితంగా తక్కువ తయారీ, మూసివేతలకు దారితీయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా ఔషధాలపై భారత ప్రభుత్వం 10 శాతం మేర దిగుమతి సుంకం విధిస్తోంది. ఇదే సమయంలో భారత ఔషధాలపై అమెరికా ఎలాంటి సుంకం విధించడంలేదు.

తాజా నిర్ణయాల వల్ల భారత్ స్థాయిలోనే అమెరికా కూడా పన్నులు విధిస్తే ఆ భారం ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో ఇటీవలి కాలంలో ఫార్మా దిగుమతులపై ఎక్కువ ఆధారపడిన అమెరికాలో దేశీయ డిమాండ్‌ను కూడా ఈ టారిఫ్ నిర్ణయం ప్రభావితం చేయవచ్చని శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కో పార్ట్‌నర్ అరవింద్ శర్మ చెప్పారు. అమెరికాలో ఔషధాల కొరత ఏర్పడవచ్చు. భారత్ నుంచి పెద్ద ఎత్తున ఔషధ సరఫరా జరుగుతోంది. 2022 నాటి డేటా ప్రకారం, అమెరికాకు వెళ్లే ప్రతి పదింటిలో నాలుగు భారతీయ కంపెనీల నుంచే సరఫరా అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ఔషధ పరిశ్రమపై అమెరికా మార్కెట్‌పై ఆధారపడి ఉందని, భారత ఎగుమతుల్లో మూడోవంతు వాటా అమెరికాదేనని అరవింద్ శర్మ పేర్కొన్నారు. సుంకాలను విధించడం ద్వారా, అమెరికా తన దేశీయ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పెంచుతుందని, వినియోగదారులపై భారం మోపుతుంది. మరోవైపు, అమెరికాలో మార్కెట్ పరిధి తక్కువగా ఉన్నందున భారత ఆటోమొబైల్ రంగం రెసిప్రోకల్ టారిఫ్ కారణంగా తక్కువ ప్రభావాన్ని చూడవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి.


Read Also..

Pepsico: భారత మార్కెట్లో విస్తరణపై దృష్టి సారించిన పెప్సికో

Next Story