Bajaj: త్వరలో 350సీసీ సామర్థ్యంతో ట్రయంప్ఫ్ బైకులు

by S Gopi |

ట్రయంఫ్‌కు చెందిన 400 మోడళ్ల బైకుల 399సీసీ ఇంజిన్‌లో చిన్న వెర్షన్ తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది

Bajaj: త్వరలో 350సీసీ సామర్థ్యంతో ట్రయంప్ఫ్ బైకులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల భారత ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా 350సీసీ బైకులపై పన్ను రేట్లను తగ్గించింది. ఇదే సమయంలో ఆపైన సీసీ సామర్థ్యం ఉన్న బైకులు లగ్జరీ విభాగం కింద 40 శాతం పన్ను విధించింది. దీంతో ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు ట్రయంఫ్, కేటీఎం అధిక పన్ను సమస్యను ఎదుర్కొంటున్నాయి. అయితే, ఈ బ్రాండ్ బైకులను భారత మార్కెట్లోకి అందిస్తున్న బజాజ్ పెంచిన పన్ను భారాన్ని తాము భరిస్తామని వెల్లడించింది. అయితే, భవిష్యత్తులో ఈ సమస్యను పరిష్కరించేందుకు బజాజ్ పెద్ద ప్రణాళికలు కలిగి ఉన్నట్టు సమాచారం. కొత్త జీఎస్టీ రేట్ల గురించి ప్రకటన వెలువడిన తర్వాత, బజాజ్ భారత మార్కెట్లో ట్రయంఫ్‌కు చెందిన 400 మోడళ్ల బైకుల 399సీసీ ఇంజిన్‌లో చిన్న వెర్షన్ తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జీఎస్టీ పన్నుల ఆధారంగా వీటిని 350సీసీ పరిధిలోకి వచ్చేలా రూపొందించే అవకాశం ఉంది. కొత్త ఇంజిన్ చిన్న బోర్‌తో పనిచేస్తుంది.

40 శాతానికి, 18 శాతానికి మధ్య వ్యత్యాసం అధికంగా ఉండటంతో 350సీసీ కేటగిరీకి సరిపోయేలా కొత్త స్కేల్డ్-డౌన్ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం 399సీసీ బైకు 40హెచ్‌పీ, 37.5 టార్క్‌తో పనిచేస్తుండగా, కొత్తగా రూపొందించే బైకులో పవర్‌ను 3-5 హెచ్‌పీ తగ్గించవచ్చౌ. అయితే, టీ4 మోడల్ బైక్ ఇప్పటికే 31హెచ్‌పీ, 36 టార్క్‌తో ఉంది. కాబట్టి ఈ బైక్ ఇంజిన్ సమార్థ్యాన్ని ఎంత మేరకు తగ్గిస్తారనేది ఆసక్తికరం. అధిక పన్నుల సవాళ్లను అధిగమించేందుకు, ఇప్పటికే ఈ కేటగిరీలో అధిక మార్కెట్ వాటా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోటీకి కూడా అవకాశం ఉండటంతో బజాజ్ ఆ దిశగా మార్పులు చేయనుంది. ట్రయంఫ్‌తో పాటు కేటీఎం బైకుల్లోనూ ఇదే తరహా మార్పులకు బజాజ్ సిద్ధమవుతోంది.

Next Story