Triumph: 350సీసీ ఇంజిన్‌తో ట్రయంఫ్ బైకుల విడుదల

by S Gopi |

ఇప్పటివరకు 400సీసీ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లను అందించిన కంపెనీ ఇప్పుడు దీన్ని 350సీసీకి తగ్గించింది

Triumph: 350సీసీ ఇంజిన్‌తో ట్రయంఫ్ బైకుల విడుదల
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ బ్రిటన్ మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ భారత మార్కెట్లో కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు 400సీసీ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లను అందించిన కంపెనీ ఇప్పుడు దీన్ని 350సీసీకి తగ్గించింది. సోమవారం కంపెనీ 350సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్న కొత్త బైకులను విడుదల చేసింది. గతేడాది ఆఖరులో కేంద్రం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా 350సీసీ సామర్థ్యం కంటే తక్కువ ఉన్న బైకులపై పన్నులు తగ్గించింది. అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటిపై గరిష్ఠ జీఎస్టీని విధించింది. ఈ ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ట్రయంఫ్ తన పోర్ట్‌ఫోలియోలోని బైకుల ఇంజిన్ సామర్థ్యాన్ని తగ్గించింది. అయితే, ధరల్లో మాత్రం పెద్దగా మార్పులేమీ చేయలేదు. బేసిక్ ట్రయంఫ్ స్పీడ్ టీ4ను మునుపటి ధర రూ. 1.95 లక్షలకే లాంచ్ చేసింది. స్పీడ్400 ధరను మాత్రం రూ. 7,110 తగ్గించి రూ. 2,31,890కి, స్క్రాంబ్లర్ ధరను రూ. 10,736 తగ్గించి రూ. 2,59,241 ధరకు, థ్రక్స్‌టన్ ధరను రూ. 10,941 తగ్గించి రూ. 2,65,442కి తగ్గించింది. ఇక, స్క్రాంబ్లర్ 400ఎక్స్‌సీ ధరను మాత్రం రూ. 1,793 పెంచి రూ. 2,98,709కి పెంచింది.

Next Story