Two wheelers: ఇకపై కొత్త టూవీలర్లకు ఏబీఎస్‌తో పాటు 2 హెల్మెట్లు తప్పనిసరి

by S Gopi |

ప్రస్తుతం దేశంలో విక్రయించే 125సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను ఏబీఎస్ తప్పనిసరి నిబంధన ఉంది.

Two wheelers: ఇకపై కొత్త టూవీలర్లకు ఏబీఎస్‌తో పాటు 2 హెల్మెట్లు తప్పనిసరి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా వాహన ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. స్కూటర్లు, మోటార్ సైకిళ్లతో సహా దేశంలో విక్రయించే అన్ని కొత్త ద్విచక్ర వాహనాలు, ఇంజిన్ పరిమాణంతో సంబంధం లేకుండా, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఆమోదం తెలిపిన కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, త్వరలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయాలు, మరణాలను తగ్గించడానికి ఈ కొత్త భద్రతా ప్రమాణం అవసరమని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో విక్రయించే 125సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలను ఏబీఎస్ తప్పనిసరి నిబంధన ఉంది. అంటే దాదాపు 40 శాతం ద్విచక్ర వాహనాలు ఈ భద్రతా ప్రమాణ పరిధిలో లేవు. కానీ, కొత్త నిబంధన అమలైతే అన్ని రకాల స్కూటర్లు, మోటార్‌సైకిళ్లకూ మోడల్‌తో సంబంధం లేకుండా ఏబీఎస్ సిస్టమ్ అమరుస్తారు. దేశవ్యాప్తంగా ఎంట్రీ లెవల్ మోడల్ టూ-వీలర్లే 75 శాతం వరకు ఉండొచ్చు.

2020 నాటి గణాంకాల ప్రకారం, 20 శాతం రోడ్డు ప్రమాదాలు టూవీలర్ల కారణంగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో మరణించే వారిలో 44 శాతం టూవీలర్ నడిపేవారు ఉన్నారు. ఈ క్రమంలోనే కేంద్రం ప్రమాదాలను తగ్గించే దిశగా చర్యలు చేపడుతోంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్( ఏబీఎస్) ద్వారా వాహనాలు సడన్‌గా బ్రేక్ వేసిన సమయంలో చక్రాలు లాక్ అవకుండా కాపాడతాయి. దీనివల్ల రైడర్ టూవీలర్‌ను కంట్రోల్ చేస్తూనే, స్కిడ్ కాకుండా చూసుకోవచ్చు.

ఇకపై 2 హెల్మెట్లు

ఏబీఎస్‌తో పాటు కొత్త ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే సమయంలో ప్రభుత్వం బీఐఎస్-సర్టిఫైడ్ ఉన్న రెండు హెల్మెట్‌లను అందించడాన్ని కూడా తప్పనిసరి చేయనుంది. ప్రస్తుతం, టూ-వీలర్ కొనే సమయంలో ఒక హెల్మెట్ మాత్రమే తప్పనిసరి ఇవ్వాలనే నిబంధన ఉంది. రెండు ఇవ్వడం ద్వారా రైడర్, పెవిలియన్ ఇద్దరి భద్రతను మెరుగుపరిచే వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఏబీఎస్, 2 హెల్మెట్ల నిబంధన అమలైతే దానికి తగినట్టు ద్విచక్ర వాహనాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఏబీఎస్ అమర్చేందుకు, అదనంగా ఒక హెల్మెట్ ఇచ్చేందుకు ఖర్చు పెరుగుతుంది. ఆ భారాన్ని కంపెనీలు కస్టమర్లపైనే వేస్తాయి. ఫలితంగా టూవీలర్ ధరలు కనీసం రూ. 2,000 నుంచి రూ. 4,000 వరకు పెరగవచ్చు.

Next Story