India-US: త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి

by S Gopi |

ఇది దీర్ఘకాలిక చర్చలలో పురోగతిని సూచిస్తుందని వెల్లడించారు.

India-US: త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలో ఖరారు కానుందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ ఆశావాదాన్ని వ్యక్తం చేశారు. ఒప్పందం కుదిరేందుకు ఎంతో దూరం లేదని వాషింగ్టన్‌లో జరిగిన భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో అన్నారు. చర్చల సందర్భంగా రెండు దేశాలు ఉమ్మడి ప్రయోజనాలను కనుగొన్నాయని, ఇది దీర్ఘకాలిక చర్చలలో పురోగతిని సూచిస్తుందని వెల్లడించారు. సమీప భవిష్యత్తులో యునైటెడ్ స్టేట్స్, భారత్ మధ్య ఒప్పందాన్ని చూస్తారు. భారత ప్రభుత్వం తరపున సరైన వ్యక్తిని పంపితే, తమ వైపు నుంచి కూడా సరైన వ్యక్తిని పంపిస్తాం. తద్వారా ద్వైపాక్షిక ఒప్పందం కుదురుతుంది. భారత్‌తో పాటు అమెరికాతో ముందుగా ఒప్పందం చేసుకునే దేశాలకు మెరుగైన డీల్ సొంతమవుతుంది. జూలై 4-9 తేదీల్లోపు ఒప్పందం కోసం ముందుకొచ్చే దేశాలకు అవకాశాలు ఉంటాయని లుట్నిక్ వివరించారు. వాషింగ్టన్‌లో జరిగిన యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరం సదస్సులో ఆయన వ్యాఖ్యలు, వాణిజ్య ఒప్పందాలను వేగవంతం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు అద్దం పడుతోంది.

పరస్పర మార్కెట్లకు ప్రాధాన్యత

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా వాణిజ్యంపై అధిక సుంకాలు విధిస్తున్నాయనే కారణంతో అనేక దేశాలపై పరస్పర సుంకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ సైతం వీలైనంత త్వరగా ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. రెండు దేశాలు కలిసి ఓ అభిప్రాయానికి వచ్చాయి. వ్యాపారాల విషయంలో పరస్పర మార్కెట్లకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరమని ఉందని, దానికోసం ఒప్పందం ఖరారు కోసం పనిచేస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం నాటి ప్రకటనలో తెలిపారు. ఇటీవలే భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధికారుల బృందం ఢిల్లీ పర్యటనలో ఉంది. ఈ నెలాఖరు నాటికి ఒప్పందం ఓ కొలిక్కి రానుందని సమాచారం.

Next Story