Finance Ministry: బ్యాంకులకు రూ. 40,635 కోట్లు బాకీ ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారులు

by S Gopi |

2025, మార్చి 31 నాటికి టాప్-10 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంకులకు మొత్తం రూ. 40,635 కోట్లు బకాయిపడ్డారని తెలిపారు

Finance Ministry: బ్యాంకులకు రూ. 40,635 కోట్లు బాకీ ఉన్న ఉద్దేశపూర్వక ఎగవేతదారులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల వల్ల బ్యాంకులు వేలాది కోట్లు నష్టపోతున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనికి సంబంధించి వివరాలను పార్లమెంటుకు తెలియజేశారు. 2025, మార్చి 31 నాటికి టాప్-10 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంకులకు మొత్తం రూ. 40,635 కోట్లు బకాయిపడ్డారని తెలిపారు. ఇందులో అత్యధికంగా ఏబీబీ షిప్‌యార్డ్ రూ. 6,695 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా, దాని తర్వాత గీతాంజలి జెమ్స్ రూ. 6,236 కోట్లు, బీటా నాఫ్తోల్ రూ. 5,268 కోట్లు, రాకేష్‌కుమార్ కుల్దీప్‌సింగ్ వధావన్ రూ. 4,291 కోట్ల బాకీ ఉన్నాయని ఆర్థిక మంత్రి లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వీటితో పాటు భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్లు రూ. 3,810 కోట్లు, రాజా టెక్స్‌టైల్స్ రూ. 3,260 కోట్లు, గిల్ట్ ప్యాక్ రూ. 3,080 కోట్లు, ర్యాంక్ ఇండస్ట్రీస్ రూ. 2,655 కోట్లు, హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ. 2,540 కోట్లు బ్యాంకులకు బకాయిపడ్డారు.

ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, పెద్ద ఎగవేతదారుల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) జారీ చేసిన మాస్టర్ డైరెక్షన్స్ ద్వారా, బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను నెలవారీగా అన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు (సీఐసీలకు) సమర్పించాలని, సీఐసీలు ఆ వివరాలను తమ తమ వెబ్‌సైట్లలో ప్రదర్శించాలని సూచించినట్లు ఆర్థిక మంత్రి వివరించారు. అలాగే, ఆర్‌బీఐ సమాచారం ప్రకారం, ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా వర్గీకరించిన ఖాతాల విషయంలో, వారిపై కొనసాగుతున్న క్రిమినల్ విచారణకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఏ బ్యాంకు అయినా రాజీ పరిష్కారాలను చేపట్టవచ్చని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు.

Next Story