IMF: ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ఆర్థిక ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం

by S Gopi |

ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం వల్ల పశ్చిమాసియాతో పాటు ప్రపంచ ఆర్థికవ్యవస్థపై కలిగే ఆర్థిక నష్టాలను అంచనా వేయలేమని అభిప్రాయపడింది.

IMF: ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ఆర్థిక ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మద్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంగళవారం స్పందించింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ఈ యుద్ధ ప్రభావం ఎంత మేర ఉంటుందనే దానిపై ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. అయితే, ఇప్పటికిప్పుడు ఈ యుద్ధం వల్ల పశ్చిమాసియాతో పాటు ప్రపంచ ఆర్థికవ్యవస్థపై కలిగే ఆర్థిక నష్టాలను అంచనా వేయలేమని, అలా చేస్తే తొందరపాటు అవుతుందని అభిప్రాయపడింది. వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలకు అంతరాయాలు, ఇంధన ధరల పెరుగుదల, ఆర్థిక మార్కెట్లలో అస్థిరతలను గమనించాం. పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఇప్పటికే అనిశ్చితిలో ఉన్న ప్రపంచ ఆర్థికవ్యవస్థపై మరింత ఒత్తిడి ఉంటుందని, యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దాన్ని బట్టి నష్టం ఉంటుందని తెలిపింది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ కష్టాల్లో ఉంది. ఇప్పుడు మరో యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రపంచ సరుకు రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి, సరఫరా కుంటుపడుతుందని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. గ్లోబల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నిధులను సురక్షిత సాధనాలకు తరలిస్తారని, దీనివల్ల స్టాక్ మార్కెట్లలో నష్టాలు పెరుగుతాయని అభిప్రాయపడింది.

Next Story