ఇది భారత్‌కు మంచి అవకాశం.. ట్రంప్ టారిఫ్‌లపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్టు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-07 14:02:25  IST  )

రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా టారీఫ్‌లు (Tariffs) విధిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇది భారత్‌కు మంచి అవకాశం.. ట్రంప్ టారిఫ్‌లపై ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్టు
X

దిశ, వెబ్ డెస్క్: రష్యా (Russia) నుంచి చమురు కొనుగోళ్లు చేస్తోన్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారీగా టారీఫ్‌లు (Tariffs) విధిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారత్‌పై (India) ఇప్పటికే ఉన్న 25 శాతం దిగుమతి సుంకాలను మరింతగా పెంచుతూ, మొత్తం 50 శాతానికి చేరుస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఈ కొత్త టారిఫ్‌లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. ఇది భారత ఎగుమతిదారులపై మరియు విదేశీ పెట్టుబడులపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. అయితే, తాజాగా ఈ పరిణామాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) స్పందిస్తూ సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు పెట్టారు.

ట్రంప్ టారిఫ్‌లను భారత్ మంచి అవకాశంగా మార్చుకోవాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఇప్పుడున్న ఈ టారీఫ్ మథనం.. 1991లో దేశం ఎదుర్కొన్న విదేశీ మారక నిల్వల సంక్షోభం లాంటిదే. అప్పుడు ఆర్థిక సంస్కరణల ద్వారా భారత్‌లో లిబరలైజేషన్‌కు నాంది పడింది. ఇప్పుడు కూడా ఇదే తరహాలో, సరైన వ్యూహాలతో ముందడుగు వేస్తే దేశానికి ‘అమృతం’ దక్కే అవకాశం ఉందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'అమెరికా మొదలుపెట్టిన టారిఫ్‌ల (Trump Tariffs) యుద్ధంతో ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా వంటి దేశాలు సొంత వ్యూహాలకు పదునుపెట్టాయి. ఫలితంగా ప్రపంచవృద్ధికి కొత్త ఇంజిన్లు లభిస్తున్నాయి. ఇప్పుడు భారత్‌ కూడా ఈ సంక్లిష్ట క్షణాలను అవకాశంగా మల్చుకోవాలి. ఇందుకోసం భారత్‌ రెండు బలమైన అడుగులు వేయాలి' అని సూచించారు.

'ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను వేగంగా మెరుగుపరచడం. పెట్టుబడిదారుల కోసం ప్రభావవంతమైన సింగిల్ విండో క్లియరెన్స్‌ వ్యవస్థను తీసుకురావాలి. అలాగే, విదేశీ మారకద్రవ్యాన్ని పెంచేందుకు పర్యాటక రంగాన్ని శక్తివంతంగా మలచాలి. ఈ రెండు చర్యలతో పాటు, ఎంఎస్‌ఎంఈలకు ద్రవ్యలభ్యత, తయారీ రంగంపై దిగుమతి సుంకాల సడలింపులు, పోటీతత్వాన్ని పెంపొందించే విధానాలు కూడా అవసరం' అని ఆనంద్ మహీంద్రా సూచించారు.

Next Story