India: తయారీలో చైనా తరహా ఆశలను భారత్ వదులుకోవాలి: రఘురామ్ రాజన్

by S Gopi |

అసెంబ్లింగ్ వంటి తక్కువ స్కిల్ కలిగిన విభాగాల్లో కూడా యంత్రాల పనితీరు వేగంగా ఉంది

India: తయారీలో చైనా తరహా ఆశలను భారత్ వదులుకోవాలి: రఘురామ్ రాజన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: తయారీ రంగంలో మరో చైనాగా మారాలనే ఆశలను భారత్ వదులుకోవాలని మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. అంతర్జాతీయ పరిణామాలు, నిర్మాణాత్మకమైన పరిమితుల కారణంగా తక్కువ ఖర్చుతో కూడిన ఫ్యాక్టరీ ఆధారిత వృద్ధి అసంభవం. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఉద్యోగాల సృష్టికి సాంప్రదాయ చైనా మాదిరి తయారీపై ఆధారపడకుండా జాగ్రత్త వహించాలని రాజన్ హెచ్చరించారు. ప్రముఖ మేగజైన్ ఫ్రంట్‌లైన్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి పరిస్థితుల్లో ప్రపంచానికి మరొక చైనాకు చోటు లేదు. ప్రపంచ తయారీ ఇప్పుడు పూర్తిగా ఆటోమేటెడ్, రక్షణాత్మక, తక్కువ వేతనాలతో మెరుగైన మౌలికసదుపాయాలు ఉన్న వియత్నాం, చైనా దేశాలతో నిండి ఉంది. అసెంబ్లింగ్ వంటి తక్కువ స్కిల్ కలిగిన విభాగాల్లో కూడా యంత్రాల పనితీరు వేగంగా ఉంది. కంపెనీలకు కావాల్సింది యంత్రాలను చూసుకోగల, మరమ్మత్తు చేయగలిగిన ఉద్యోగులు కావాలి. మాన్యువల్ పనిచేసే వారి స్థానంలో ఇప్పటికే యంత్రాలు భర్తీ అయ్యాయని రాజన్ వివరించారు. ఇదే సమయంలో అనేక దేశాలు స్థానికంగానే చిన్న తయారీ పరిశ్రమ ఉండాలని కోరుకుంటున్నాయి. కాబట్టి భవిష్యత్తులో దేశీయంగా తయారీ రంగంలో అంతగా ఉద్యోగాలు ఉంటాయని ఆశించలేమని రఘురామ్ రాజన్ తెలిపారు.

ఇప్పుడు అవాస్తవికమైన తయారీ ఆధారిత మోడల్ వెంటపడే బదులుగా, బహుముఖ విధానాలు అనుసరించాలని రాజన్ సూచించారు. భారత్ ఇప్పటికే అధిక-విలువైన సేవల రంగంలో రాణిస్తోందని, ప్రపంచ సేవా ఎగుమతుల్లో 4.5 శాతం వాటా కలిగి ఉందని అన్నారు. ఈ రంగం అందరూ ఉద్యోగార్ధులను తీసుకోలేనప్పటికీ, భవిష్యత్ వృద్ధికి కీలకమైన స్తంభం అవుతుందన్నారు. లాజిస్టిక్స్, ట్రక్ డ్రైవింగ్, ప్లంబింగ్, మరమ్మతు వంటి సేవలను పెంచడం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.

Next Story