Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్‌పై కొరడా

by S Gopi |

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నియంత్రించడం, ఆర్థిక మోసాలకు చెక్ పెట్టడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలు.

Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్‌పై కొరడా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బెట్టింగ్ యాప్ మాఫియా కారణంగా అనేక కుటుంబాలు దెబ్బతిన్నాయి. సెలబ్రిటీలతో ప్రచారం, సామాన్యులకు అవకాశాల పేరుతో అనేక మోసాలు చేస్తున్న ఆన్‌లైన్ గేమింగ్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025ను ఆగష్టు 20న పార్లమెంటులో ఆమోదించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నియంత్రించడం, ఆర్థిక మోసాలకు చెక్ పెట్టడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలు. గత కొంతకాలంగా ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల మోసపూరిత ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. వాటికి ప్రచారం కల్పిస్తున్న సెలబ్రిటీలపై దర్యాప్తు సంస్థలు విచారణ కూడా చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025 ఎలా పనిచేస్తుంది? ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్స్‌‌, ఏ కంపెనీలు ప్రభావితం అవుతాయి? గేమింగ్ రంగం ఎదుర్కొనే సమస్యలు? నష్టం? వంటి విషయాలను తెలుసుకుందాం.

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025 లక్ష్యం

* సానుకూల గేమింగ్‌ను ప్రోత్సహించడం: ఈ-స్పోర్ట్స్, సురక్షితమైన సోషల్ లేదా ఎడ్యుకేషనల్ గేమ్స్‌ను ప్రోత్సహించడం.

* రిస్కీ మనీ గేమ్‌ల నిషేధం: వ్యసనం లేదా ఆర్థిక నష్టాన్ని కలిగించే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్, రియల్ మనీ గేమ్‌ల కట్టడి.

* సామాన్యులకు భద్రత: మోసం, మనీలాండరింగ్, ఇతర ఆన్‌లైన్ రిస్క్ నుంచి వినియోగదారులను, ముఖ్యంగా యువతను రక్షించడం.

* కొత్త ఆవిష్కరణలకు మద్దతు: దేశీయ గేమింగ్ పరిశ్రమను బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడానికి నియమాలు, మార్గదర్శకాలను అందించడం.

బిల్లులోని కీలక నిబంధనలు, పెనాల్టీ

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు అమల్లోకి వస్తే రియల్-మనీ ఆన్‌లైన్ గేమ్‌లు నిషేధం ఎదుర్కొంటాయి. ఫాంటసీ స్పోర్ట్స్, పోకర్, రమ్మీ, ఆన్‌లైన్ లాటరీలతో సహా స్కిల్ బేస్‌డ్ లేదా ఛాన్స్ బేస్‌డ్ ఏవైనా సరే నిషేధానికి గురికాక తప్పదు. అయినప్పటికీ చట్టవిరుద్ధంగా నిర్వహించే మనీ గేమ్ యాజమాన్యానికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి జరిమానా. కొన్నిసార్లు రెండూ విధించవచ్చు. రియల్-మనీ ఆన్‌లైన్ గేమ్‌ల యాడ్స్ చేస్తే 2 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ. 50 లక్షల జరిమానా. కొన్నిసార్లు రెండూ విధించే అవకాశం. పదే పదే చట్టాన్ని మీరితే 3–5 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ. 2 కోట్ల వరకు జరిమానా, రెండూ విధించే అవకాశం కూడా ఉంటుంది. రియల్-మనీ గేమింగ్‌లో భాగమయ్యే బ్యాంకులు, పేమెంట్ గేట్‌వేలు, ప్రకటనదారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే, ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారిని నేరస్థులుగా పరిగణించరు, వారు బాధితులవుతారు.

రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్

ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ల రైజిస్ట్రేషన్, వర్గీకరణ, లైసెన్సింగ్‌ను పర్యవేక్షించడానికి జాతీయ ఇ-స్పోర్ట్స్ అథారిటీ లేదా జాతీయ ఆన్‌లైన్ గేమింగ్ కమిషన్ (ఎన్ఓజీసీ)ను ఏర్పాటు చేయనున్నారు.

ప్రభావితమయ్యే కంపెనీలు

కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా గేమింగ్ రంగంలో దేశీయ రియల్-మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు కొత్త కష్టాలను ఎదుర్కొనే అవకాశం అవి.. డ్రీమ్11, మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్), విన్జో, గేమ్స్24x7 (మై11సర్కిల్), ఖేలో ఫాంటసీ, జంగ్లీ గేమ్స్, గేమ్స్‌క్రాఫ్ట్, 99గేమ్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.

ఉపాధి నష్టం

ప్రస్తుతం ఈ రంగంలో కఠిన నియంత్రణ, పన్నుల కారణంగా 2,00,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. 400 కంటే ఎక్కువ కంపెనీలు మూతబడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, యానిమేషన్, కంటెంట్ క్రియేషన్, ఏఐ, డిజైన్, యాడ్-టెక్ వంటి ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయి.

పెట్టుబడులపై ఒత్తిడి

కొత్త నిబంధనలు, చర్యలతో ఈ రంగంలోకి వచ్చే విదేశీ పెట్టుబడుల్లో 6 బిలియన్ డాలర్ల(రూ. 50 వేల కోట్లకు పైగా) నష్టం ఏర్పడవచ్చు. ఈ రంగంలో ఇప్పటికే రూ. 25,000 కోట్లకు పైగా ఎఫ్‌డీఐలు వచ్చాయి, కొత్త వచ్చే పెట్టుబడులు ఆగిపోవచ్చు.

ఆదాయ, పన్ను నష్టం

ఆన్‌లైన్ గేమింగ్ రంగంపై పడే పన్ను కారణంగా ఏటా రూ. 20,000 కోట్ల నష్టాలు ఎదురవ్వొచ్చు. అంతేకాకుండగా, ఈ రంగానికి అనుబంధంగా ఉండే యాడ్స్, స్పాన్సర్‌షిప్‌లు, డేటా సెంటర్లు, సైబర్ సెక్యూరిటీ ఏటా రూ. 6,000 కోట్ల వరకు నష్టపోయే ప్రమాదం ఉంది. స్పాన్సర్‌షిప్, వీక్షకుల సంఖ్య తగ్గడం వల్ల స్పోర్ట్స్ లీగ్‌లు, మీడియా కూడా నష్టపోవచ్చు.

ఎటువంటి గేమ్స్‌పై ఈ బిల్లు ప్రభావితం చేస్తుందంటే..

* రియల్-మనీ గేమ్‌లు, ఫాంటసీ గేమ్స్, పోకర్, రమ్మీ, లాటరీ అన్నిటిపై నిషేధం

* ఆఫ్‌షోర్, నియంత్రణ లేని వాటిపై చర్యలు

* సోషల్/క్యాజువల్ గేమ్స్‌ను చట్ట ప్రకారం నియంత్రణ పరిధిలోకి తీసుకురానున్నారు.

* ఎడ్యుకేషనల్ గేమ్స్, ఆర్థిక నష్టం లేని సబ్‌స్క్రిప్షన్ బేస్‌డ్ గేమ్స్, ఈ-స్పోర్ట్స్‌కు అనుమతి ఉంటుంది.

Next Story