Plastic Notes: నోట్ల తయారీకి అయ్యే ఖర్చెంత?

by S Gopi |   (  Updated:2026-07-26 16:56:49  IST  )

ప్రస్తుతం భారత్‌లో చెలామణిలో ఉన్న నోట్లను 100 శాతం పత్తి (కాటన్ ఫైబర్)తో తయారు చేయడం వల్ల వాటి మన్నిక చాలా తక్కువగా ఉంటోంది.

Plastic Notes: నోట్ల తయారీకి అయ్యే ఖర్చెంత?
X

దిశ, బిజినెస్ బ్యూరో: మనం రోజూ ఉపయోగించే రూ.10, రూ.20, రూ.50 నోట్లు కొన్ని నెలల్లోనే మురికిపడటం, చిరిగిపోవడం లేదా నీటిలో తడిసి పాడవడం సాధారణమే. అలాంటి నోట్లను తిరిగి ముద్రించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం భారత్‌లో చెలామణిలో ఉన్న నోట్లను 100 శాతం పత్తి (కాటన్ ఫైబర్)తో తయారు చేయడం వల్ల వాటి మన్నిక చాలా తక్కువగా ఉంటోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్లాస్టిక్/పాలిమర్ నోట్లను మార్కెట్లోకి తెచ్చేందుకు ఆర్‌బీఐ సన్నాహాలు చేస్తోంది. సమాజంలో తొందరగా చేతులు మారే, త్వరగా పాడయ్యే రూ. 10, రూ. 20 వంటి తక్కువ విలువైన డినామినేషన్లతో మొదటి దశ పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని ఆర్‌బీఐ భావిస్తోంది.

నోట్ల ముద్రణే ఆర్‌బీఐకి భారీ ఖర్చు

నోట్లు త్వరగా పాడైపోతుండటంతో ఆర్‌బీఐ ప్రతి ఏటా భారీగా కొత్త నోట్లను ముద్రించాల్సి వస్తోంది. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే 2,300 కోట్లకు పైగా పాడైపోయిన నోట్లను గుర్తించిన ఆర్‌బీఐ, వాటి స్థానంలో 1,200 కోట్లకు పైగా కొత్త నోట్లను ముద్రించడానికి రూ. 6,373 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కో నోటు డినామినేషన్‌ను బట్టి రూ. 10కి 96 పైసల నుంచి, రూ. 500 నోటుకు రూ. 2.57 వరకు ముద్రణ ఖర్చు అవుతోందని ఆర్‌బీఐ డేటా చెబుతోంది. అయితే, పాలిమర్ నోట్ల తయారీకి ప్రాథమికంగా రూ. 2 నుంచి రూ. 6 వరకు ఖర్చయినప్పటికీ, ఇవి 5-7 ఏళ్ల పాటు ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ఫలితంగా తరచూ రీ-ప్రింటింగ్ చేసే అవసరం తగ్గి, ఆర్‌బీఐకి ఏటా దాదాపు రూ. 6,000 కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది.

గత పదేళ్లలో ఆర్‌బీఐ దాదాపు 26,000 కోట్ల కరెన్సీ నోట్లు ముద్రించేందుకు మొత్తం రూ.52,095 కోట్లు ఖర్చు చేసింది.

హైటెక్ సెక్యూరిటీ

కాగితపు నోట్లు కాగితపు నోట్ల కంటే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. నీటిలో తడిసినా, ఉతికినా, సాధారణ వినియోగంలో సులభంగా చిరిగిపోవు. దీంతో పదేపదే కొత్త నోట్లు ముద్రించాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రారంభంలో ఒక్కో పాలిమర్ నోటు తయారీ ఖర్చు ఎక్కువగా ఉన్నా, దీర్ఘకాలంలో ముద్రణ, రవాణా, పాత నోట్ల ధ్వంసం వంటి ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పర్యావరణపరంగానూ ఇవి ప్రయోజనకరమే. ఉపయోగం పూర్తయిన తర్వాత వీటిని రీసైకిల్ చేసి ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీలో వినియోగించవచ్చు. సాంకేతికంగా కూడా పాలిమర్ నోట్లలో అత్యంత క్లిష్టమైన భద్రతా ప్రమాణాలను పొందుపరచవచ్చు. ప్రత్యేకమైన హోలోగ్రాఫిక్ డిజైన్లు, మైక్రో ప్రింటింగ్, అడ్వాన్స్‌డ్ ఇంక్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల నకిలీ నోట్లను ముద్రించడం కేటుగాళ్లకు దాదాపు అసాధ్యంగా మారుతుంది.

గత అనుభవాలు

ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, యూకే, వియత్నాం సహా దాదాపు 60కి పైగా దేశాలు పాలిమర్ కరెన్సీని విజయవంతంగా ఉపయోగిస్తున్నాయి. భారత్‌లో కూడా 2012లోనే యూపీఏ ప్రభుత్వ హయాంలో కొచ్చి, మైసూర్, భువనేశ్వర్ వంటి నగరాల్లో రూ. 10 ప్లాస్టిక్ నోట్లను పరీక్షించాలని చూసినప్పటికీ, ఏటీఎం మిషన్లు వాటిని రీడ్ చేయడంలో ఎదురైన సాంకేతిక లోపాల వల్ల ఆ ప్రాజెక్టు ముందడుగు పడలేదు. అయితే, ఈసారి ఆర్‌బీఐ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాంకేతిక చిక్కులను అధిగమించి, పాలిమర్ కరెన్సీని పక్కాగా పట్టాలెక్కించేందుకు అడుగులు వేస్తోంది.

డిజిటల్ యుగంలోనూ నగదే

యూపీఐ, డిజిటల్ చెల్లింపులు ఎంత పెరిగినా, దేశంలో నగదు వినియోగం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ విలువ ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. చిన్న వ్యాపారాలు, గ్రామీణ ప్రాంతాలు, రోజువారీ లావాదేవీల్లో నగదే ప్రధాన చెల్లింపు సాధనంగా కొనసాగుతోంది. అందుకే ఆర్‌బీఐ కూడా దాన్ని మరింత మన్నికగా, సురక్షితంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించగల వ్యవస్థను నిర్మించాలని నిర్ణయించింది. అయితే పాలిమర్ షీట్ల కోసం విదేశీ సరఫరాదారులపై ఆధారపడాల్సి రావడం, దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయి. అందుకే ప్లాస్టిక్ కరెన్సీ అమలు ఒక్కసారిగా కాకుండా, దశలవారీగా జరిగనుంది.

Next Story