- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రముఖ పారిశ్రామికవేత్త మృతి
భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటీష్ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) లండన్‌లో 94 ఏళ్ల వయసులో మరణించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటీష్ పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ (Lord Swraj Paul) లండన్‌లో 94 ఏళ్ల వయసులో మరణించారు. వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం (స్థానిక కాలమానం ప్రకారం) లార్డ్ తుదిశ్వాస విడిచారు. యూకేలో కాపారో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌ను స్థాపించిన లార్డ్ అరుదైన భారత్‌లో జన్మించిన బ్రిటీష్ ఇండస్ట్రియలిస్ట్, ఫిలాన్త్రోపిస్ట్‌గా గుర్తింపు పొందారు.
పంజాబ్‌లోని జాలంధర్‌లో 1931 ఫిబ్రవరి 18న లార్డ్ స్వరాజ్ పాల్ జన్మించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ పట్టా పొందారు. అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. అనంతరం తన తండ్రి స్థాపించిన కుటుంబ వ్యాపార సంస్థ అపీజే గ్రూప్‌లో పనిచేసేందుకు భారత్‌కు తిరిగి వచ్చారు. అయితే తన కుమార్తె అంబికా చికిత్స కోసం 1966లో యూకేకి వెళ్లారు. ఆమె మరుసటి ఏడాది లుకేమియాతో మరణించింది. అనంతరం 1968లో యూకేలో కాపారో గ్రూప్ స్థాపించి అక్కడే స్థిరపడిపోయారు. లార్డ్ కాపారో గ్రూప్‌ను స్టీల్, ఇంజనీరింగ్ రంగాలలో గ్లోబల్ ఎంటర్‌ప్రైజ్‌గా విస్తరింపజేశారు. అలాగే, 1975లో బ్రిటన్, భారత్ మధ్య మెరుగైన సంబంధాల కోసం ఇండో-బ్రిటిష్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు.
వ్యాపార రంగంలోనే కాకుండా లార్డ్ రాజకీయాల్లో మంచి గుర్తింపు సాధించారు. 1996లో లైఫ్ పీర్‌గా నియమితులైన లార్డ్ పాల్.. హౌస్ ఆఫ్ లార్డ్స్‌లో వాణిజ్యం, విద్య, ఉద్యోగవకాశాల కమిటీలలో చురుకుగా పాల్గొన్నారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్‌గా, 2009లో ప్రైవీ కౌన్సిలర్‌గా నియమితులయ్యారు. లండన్ జూను మూసివేత నుంచి కాపాడడంలో, పిల్లల విభాగం, ఇతర కార్యక్రమాలకు మద్దతు ఇచ్చారు. అలాగే, తన కుమార్తె అంబికా జ్ఞాపకార్థం అంబికా పాల్ ఫౌండేషన్ (Ambika Paul Foundation) స్థాపించి, విద్య, ఆరోగ్య రంగాల్లో అనేక సహాయ కార్యక్రమాలను నిర్వహించారు. లార్డ్ పాల్ బ్రిటన్‌లోని ధనవంతులైన ఆసియన్‌లలో ఒకరిగా ఎదిగి, దశాబ్దాల పాటు వ్యాపారం, రాజకీయాలు, పరోపకారంలో ప్రముఖ వ్యక్తిగా నిలిచారు.






