- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anthropic: ఐటీ రంగాన్ని భయపెడుతున్న ఆంథ్రోపిక్
ఆంథ్రోపిక్ కొత్త అజెంటిక్ ఏఐ అసిస్టెంట్ కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాకుండా, ఒక సంస్థకు సంబంధించిన కీలక విభాగాలను స్వయంగా నిర్వహించే విధంగా దీన్ని రూపొందించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: అధునాతన టెక్నాలజీ సామర్థ్యంతో ఇప్పటివరకు ఉద్యోగులను భయపెట్టిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఇప్పుడు మొత్తం ఐటీ రంగాన్నే భయపెట్టే స్థాయికి చేరింది. దీనికి కారణం ప్రముఖ ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్ తీసుకొచ్చిన కొత్త 'ప్లగ్ఇన్. ఇది ప్రధానంగా శ్రమ ఆధారిత సేవలపై ఆధారపడి పనిచేసే ఐటీ కంపెనీలకు సవాలుగా నిలవడంతో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా 'ఆంథ్రోపిక్' ఇప్పుడు అత్యంత విస్తృతంగా చర్చలో ఉన్న అంశంగా నిలిచింది. ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త అజెంటిక్ ఏఐ అసిస్టెంట్ కేవలం సాధారణ చాటింగ్ కోసం మాత్రమే కాకుండా, ఒక సంస్థకు సంబంధించిన కీలక విభాగాలను స్వయంగా నిర్వహించే విధంగా దీన్ని రూపొందించారు.
ఇది మానవ ప్రమేయంతో పనిలేకుండా, కొన్ని రకాల ఆఫీసు పనులను సులభంగా, స్వంతంగా పూర్తి చేస్తుందని 'ఆంథ్రోపిక్' ప్రకటించింది. ఈ ప్రకటన వల్లే ఇటీవల మన దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయంగా కూడా ఐటీ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. దీంతో చాలామందికి భవిష్యత్తులో మనుషులతో అవసరం లేని స్థాయికి టెక్నాలజీ చేరుతుందా అనే సందేహం నెలకొంది. కాబట్టి ఆంథ్రోపిక్ సంస్థ తీసుకొచ్చిన కొత్త ఏఐ ఏజెంట్ ఏంటి? అదేలా ఐటీ రంగాన్ని ఆందోళనకు గురి చేసింది? భవిష్యత్తులో ఉద్యోగులపై ఎలాంటి ప్రభావం చూపగలదనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
అసలేంటీ ఆంథ్రోపిక్?
ఆంథ్రోపిక్ అనేది ఓపెన్ఏఐకు చెందిన పాత ఉద్యోగులు స్థాపించిన ఏఐ కంపెనీ. దీనికి అమెజాన్ లాంటి దిగ్గజ సంస్థలు మద్దతిస్తున్నాయి. ఈ కంపెనీ అడ్వాన్స్‌డ్, ఎథికల్ ఏఐ సిస్టమ్స్‌ను తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నది. ముఖ్యంగా క్లాడ్ ఫ్యామిలీ మోడల్స్ - రీజనింగ్, కోడింగ్, సమ్మరైజింగ్, సంక్లిష్టమైన వర్క్‌ఫ్లోలను ఆటోమేట్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇందులో అజెంటిక్ ఏఐ అసిస్టెంట్ 'క్లాడ్ కోవర్క్' ఇప్పుడు అందరికీ కంగారు పెడుతోంది. ఈ క్లాడ్ కోవర్క్ సమర్థవంతంగా పనిచేయడానికి ఆంథ్రోపిక్ సరికొత్త ఆటోమేషన్ ప్లగ్‌ఇన్‌లను విడుదల చేసింది. ఇవి సాధారణ చాట్‌బాట్‌ల మాదిరిగా కాకుండా, పెద్ద పెద్ద సంస్థల కోసం పనిచేస్తాయి. చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని వంటి ఏఐ చాట్‌బాట్‌లు చేసే చాటింగ్ తరహా కాకుండా డేటా విశ్లేషణ, డాక్యుమెంట్ రివ్యూ, ఫైనాన్స్, లీగల్ ఆటోమేషన్, సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేయగలదు. ఇది స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని, పనులు నిర్వహిస్తుంది.
ఆంథ్రోపిక్‌కి, చాట్‌జీపీటీకి తేడా
ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏఐ టూల్స్ చాట్‌జీపీటీ, జెమిని ఏఐ, గ్రోక్ లాంటివి సాధారణ చాట్‌బాట్‌లుగా ఉన్నాయి. మనం అడిగిన వాటికి మాత్రమే ఇవి సమాధానం చెబుతాయి. ఒక విషయం గురించి కంటెంట్ అడిగితే, సమాచారం సేకరించి ఇస్తాయి. ఆంథ్రోపిక్‌కు చెందిన 'క్లాడ్ కోవర్క్' పూర్తి స్వతంత్రంగా పనులను పూర్తి చేయగలుగుతుంది. అడిగిన వాటికి బదులివ్వడమే కాదు, స్వయంగా పనులను పూర్తి చేస్తుంది.
మరింత సులభంగా చెప్పాలంటే, క్లాడ్ కోవర్క్ స్వయంగానే కంప్యూటర్లలోని ఫోల్డర్లను తెరిచి, అందులోని డాక్యుమెంట్లను సెర్చ్ చేసి, అవసరమైన ఫైల్స్‌ను సేకరిస్తాయి. అంతేకాకుండా, ఆయా ఫైల్స్‌లో కావాల్సిన మార్పులు చేసి, ఆర్గనైజ్ చేస్తుంది. ఈ పనులను సరికొత్త 11 ప్లగ్-ఇన్‌ల సహకారంతో చేస్తుంది. మార్కెటింగ్, ఫైనాన్షియల్స్, డేటా అనలిటిక్స్, రీసెర్చ్ లాంటి పలు రకాల పనులను ఇది చేస్తుందని ఆంథ్రోపిక్ వెల్లడించింది.
కొత్త టూల్ భయం
ఆంథ్రోపిక్ మరో ఏఐ మోడల్‌ను కూడా విడుదల చేసింది. క్లాడ్ ఓపస్ 4.6 పేరుతో తెచ్చిన ఈ టూల్ సీ-ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో అత్యంత క్లిష్టంగా భావించే సీ-కంపైలర్ ప్రోగ్రామ్‌ను సులభంగా రాస్తుందని చెబుతున్నారు.
ఐటీ కంపెనీల ఆందోళన
అయితే, ఐటీ రంగానికి ప్రధానంగా మనదేశంలోని ఐటీ సేవల కంపెనీలకు అత్యధిక ఆదాయం వచ్చేది అమెరికా, యూరప్ దేశాల నుంచే. ఆయా దేశాల్లో కంపెనీల సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, పరీక్ష, నిర్వహణ సేవలను మనదేశ ఐటీ కంపెనీలు అందిస్తాయి. ఇందుకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను తీసుకుంటాయి. కానీ, తాజా ఆంథ్రోపిక్ టూల్స్ వల్ల ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గే ప్రమాదం ఉందనే ఆందోళన వినిపిస్తోంది. 10 మంది చేసే పనిని, ఏఐ సాయంతో ఒకే ఉద్యోగి చేస్తే, కంపెనీలకు క్లయింట్లు నుంచి రాబడి ఆగిపోతుంది. దీనివల్ల మన ఐటీ కంపెనీల వ్యాపారాలను దెబ్బతినే ప్రమాదం ఉంది. క్లాడ్-కోవర్క్ ఏజెంట్ విడుదలైన వెంటనే ఐటీ కంపెనీల షేర్లు పతనం కావడానికి ఇదే కారణం. ఇది మొత్తం ఐటీ రంగంపైనే ప్రభావం చూపిస్తుంది. అంతర్జాతీయ టెక్ కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి ఇలాంటి ఏఐని త్వరగా అందిపుచ్చుకుంటాయి. క్లాడ్ కోవర్క్ విడుదల సందర్భంగా ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమొడేయి మాట్లాడుతూ, మరో ఐదేళ్లలో ఐటీ రంగంలోని ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు సగం వరకు ఉండవని అభిప్రాయపడ్డారు. వచ్చే 2 ఏళ్లలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను రీప్లేస్ చేయగల ఏఐ మోడల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఉద్యోగాల సంగతి
ఆంథ్రోపిక్ విడుదల చేసిన ప్లగిన్‌లు ఇదివరకు ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్లు చేసే పనులను అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తాయి. అవి..
* లీగల్ ప్లగ్-ఇన్: ఇవి కాంట్రాక్ట్ పనులను రివ్యూ, ఆర్గనైజ్ చేసి, నష్టాలను గుర్తించి, చట్టపరమైన నిబంధనలను సరిచూడటం లాంటి చేస్తుంది. ఈ ప్లగ్-ఇన్ లీగల్ టెక్ కంపెనీలు థామ్సన్ రాయిటర్స్, లీగల్ జూమ్ లాంటి కంపెనీలకు ప్రమాదంగా మారొచ్చు.
ఫైనాన్స్ ప్లగ్-ఇన్: అకౌంటింగ్ వివరాలను ఎంటర్ చేసి,, అకౌంట్లను పరిశీలించి, ఫైనాన్స్ రిపోర్టులను సిద్ధం చేస్తుంది.
* కస్టమర్ సపోర్ట్: ఫిర్యాదులను క్రమబద్దీకరించి, సమాధానాలు ఇచ్చే పనులను మనుషులతో సంబంధం లేకుండా నిర్వహిస్తుంది.
* ఎంటర్‌ప్రైజ్ సెర్చ్: ఏదైనా కంపెనీలోని ఈ-మెయిల్స్, క్లౌడ్ స్టోరేజ్, చాట్ డేటాను విశ్లేషించి నివేదిక రూపొందిస్తుంది.
ఇప్పటివరకు ‘సాస్’ ఆధారంగా ఈ పనులను నిర్వహించేవారు. ఒక సాఫ్ట్‌వేర్‌ను కంప్యూటర్ లేదా ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయకుండానే, ఇంటర్నెట్ ద్వారా పనిచేయడాన్ని సాస్ అంటారు. ఈ ప్లగ్-ఇన్స్ వల్ల క్లాడ్ కోవర్క్ లాంటి ఏఐ ఏజెంట్, టూల్స్ భవిష్యత్తులో ఈ సాఫ్ట్‌వేర్ల అవసరం లేకుండా ఏఐతోనే పనులు పూర్తవుతాయి.






