Tesla: దేశంలో తొలి కారును డెలివరీ చేసిన టెస్లా

by S Gopi |

కంపెనీ అధికారిక అవుట్‌లెట్ నుంచి నేరుగా టెస్లా కారును అందుకున్న దేశంలోనే మొదటి కస్టమర్‌గా ఆయన నిలిచారు.

Tesla: దేశంలో తొలి కారును డెలివరీ చేసిన టెస్లా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఈవీ దిగ్గజం టెస్లా ఇటీవల భారత మార్కెట్లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ, శుక్రవారం తన తొలి టెస్లా మోడల్ వై కారును భారత మార్కెట్లో డెలివరీ చేసింది. శివసేన పార్టీ నేత, మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ తొలి టెస్లా మోడల్ వై కారును కొనుగోలు చేయగా, ముంబైలోని టెస్లా షోరూమ్‌లో కంపెనీ ఆయనకు కారును అందించింది. కంపెనీ అధికారిక అవుట్‌లెట్ నుంచి నేరుగా టెస్లా కారును అందుకున్న దేశంలోనే మొదటి కస్టమర్‌గా ఆయన నిలిచారు. జూలైలో టెస్లా తన తొలి షోరూమ్‌ను ప్రారంభించిన వెంటనే సర్‌నాయక్ మోడల్ వై కోసం బుక్ చేసుకున్నారు. ఈ సందర్భంగా టెస్లా తొలి కారును అందుకున్న తర్వాత మాట్లాడిన ఆయన.. ఈ కొనుగోలు వ్యక్తిగతం కాదని, మహారాష్ట్ర పర్యావరణ అనుకూల ఆశయాలకు ప్రతీక అని అన్నారు. ప్రజల్లో ముఖ్యంగా యువతరంలో ఎలక్ట్రిక్ వాహనాల గురించి అవగాహన కల్పించడానికి నేను టెస్లా కారును డెలివరీ తీసుకున్నాను. తొలి టెస్లా కారును కొనడం సంతోషంగా ఉందన్నారు. భారత మార్కెట్లో రెండు వేరియంట్లలో అందూఅటులో ఉన్న మోడల్ వై కారు రూ. 59.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఒకసారి ఛార్జింగ్ చేసుకున్న తర్వాత 500 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. లాంగ్ రేంజ్ రేర్ వీల్ డ్రైవ్ వేరియంట్ రూ. 67.89 లక్షలకు లభిస్తుంది. ఇది 622 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దేశీయంగా ఇప్పటివరకు టెస్లా కార్ల కోసం 600 బుకింగ్‌లు వచ్చాయని కంపెనీ పేర్కొంది.

Next Story