Tech Jobs: ఐదేళ్ల కనిష్ట స్థాయికి టెక్ రంగం నియామకాలు

by S Gopi |

ప్రస్తుతం 60 శాతం క్షీణతతో 1.03 లక్షల ఖాళీలు మాత్రమే ఉన్నాయి.

Tech Jobs: ఐదేళ్ల కనిష్ట స్థాయికి టెక్ రంగం నియామకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కొత్త ఏడాది టెక్ ఉద్యోగులకు ప్రతికూలంగా మొదలైంది. ప్రస్తుత నెలకు సంబంధించి కంపెనీలు నియమించుకోవాల్సిన యాక్టివ్ టెక్ ఉద్యోగాలు గతేడాది కంటే 24 శాతం క్షీణించాయని స్పెషలిస్ట్ స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో వెల్లడించింది. 2022, జనవరిలో గరిష్ఠంగా 2.62 లక్షల యాక్టివ్ టెక్ ఉద్యోగాలు ఉండగా, ప్రస్తుతం 60 శాతం క్షీణతతో 1.03 లక్షల ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఒక్క బెంగళూరులోనే 24 వేల టెక్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇది గతేడాదితో పోలిస్తే 37 శాతం తక్కువ. ఒకప్పుడు దేశవ్యాప్తంగా నియామకాల్లో నాయకత్వం వహించిన భారతీయ టెక్ రంగం, 2022 చివరి నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇప్పటికిప్పుడు కోలుకునే సంకేతాలు కూడా కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ తర్వాత టెక్ రంగంలో వచ్చిన వృద్ధి ముగిసింది. 2021 నుంచి 2022 వరకు టెక్ నియామకాలు చాలా ఎక్కువగా జరిగి, దేశ జాబ్ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించాయి. కానీ 2022 చివరి నుంచి ఈ రంగానికి సవాళ్లు ఎదురయ్యాయి. 2023 ప్రారంభంలో నియామకాలు 50 శాతానికి పడిపోయాయి. అప్పటి నుండి, ఖాళీల సంఖ్య తక్కువగానే ఉంటున్నాయి. కొన్ని రంగాలు ఇప్పటికీ నెమ్మదిగా పెరుగుతున్నాయి. జీసీసీ-టెక్ (టెక్ రంగంలోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు) నెలవారీగా 13 శాతం, ఏటా 7 శాతం స్వల్పంగా పెరిగాయి. మొత్తంగా, టెక్ రంగంలో నియామకాలు క్షీణ దశలోనే ఉన్నాయని నివేదిక పేర్కొంది.

Next Story