TCS: టీసీఎస్‌లో 2 శాతం ఉద్యోగుల తొలగింపు

by S Gopi |

మిడ్, సీనియర్ స్థాయిలో ఉన్నవారు ఎక్కువ ప్రభావితం కావొచ్చని ఆయన సూచించారు.

TCS: టీసీఎస్‌లో 2 శాతం ఉద్యోగుల తొలగింపు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీ సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి సాగనంపనుంది. వేగవంతమైన సాంకేతిక మార్పులకు, ముఖ్యంగా కృత్రిమ మేధస్సు(ఏఐ) దృష్ట్యా పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం ఉద్యోగులను తగ్గించాలని కంపెనీ నిర్ణయించింది. ఇది దాదాపు 12,000 మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ మేరకు తీసీఎస్ సీఈఓ కె కృతివాసన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ప్రధానంగా మిడ్, సీనియర్ స్థాయిలో ఉన్నవారు ఎక్కువ ప్రభావితం కావొచ్చని ఆయన సూచించారు. ఇది అంత సులభంగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని, సీఈఓగా తాను తీసుకున్న కఠినమైన నిర్ణయాల్లో ఇదొకటని తెలిపారు. కొత్త టెక్నాలజీ అంటే ఏఐ, ఆపరేటింగ్ మోడల్‌కు సంబంధించి కీలక మార్పులు జరుగుతున్నాయి. పని విధానంలోనూ వ్యత్యాసం కనిపిస్తోంది. కాబట్టి భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా కంపెనీలో మార్పులు జరగాలి. దానికోసం ఏఐ ద్వారా ఫ్యూచర్ స్కిల్స్‌ను పెంచాలని భావిస్తున్నాం. తమ ఉద్యోగులకు వారి కెరీర్‌లో వృద్ధి, విస్తరణకు సాధించడానికి పెట్టుబడులు పెట్టాం. అయితే, కొన్ని విభాగాల్లో అది పనిచేయలేదని కృతివాసన్ వివరించారు. 2025, ఏప్రిల్ నుంచి 2026, మార్చి మధ్య ఈ తొలగింపులు జరగనున్నాయని స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది జూన్ నాటికి టీసీఎస్‌లో ప్రపంచవ్యాప్తంగా 6,13,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వివిధ దేశాలు, వ్యాపార డొమైన్‌లలో దాదాపు 12,200 మంది ఉద్యోగులు తాజా లేఆఫ్స్ జాబితాలో ఉండనున్నారు.

Next Story