TCS: టీసీఎస్ ఏఐకి భయపడదు: సీఈఓ కృతివాసన్

by S Gopi |

ఏఐ కారణంగా జరిగే మార్పుల కోసం సిద్ధంగా ఉన్నామని, కంపెనీ విధానాల్లోనూ మార్పు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

TCS: టీసీఎస్ ఏఐకి భయపడదు: సీఈఓ కృతివాసన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కృత్రిమ మేధస్సు (ఏఐ)కి భయపడదని కంపెనీ సీఈఓ కె కృతివాసన్ అన్నారు. కంపెనీ వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఏఐ కారణంగా టీసీఎస్ ప్రస్తుత ఆదాయంలో కొంత తగ్గినప్పటికీ ఏఐ టూల్స్ ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఏఐ కారణంగా జరిగే మార్పుల కోసం సిద్ధంగా ఉన్నామని, కంపెనీ విధానాల్లోనూ మార్పు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టులలో ఏఐని ఉపయోగించమని ఉద్యోగులకు చెబుతున్నాం, దీనివల్ల కంపెనీకి స్వల్పకాలంలో ఆదాయం తగ్గినా సరే ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీలో మొత్తం 6 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. వారంతా ఏఐ స్కిల్స్ కలిగి ఉండాలని ఆశిస్తున్నాం. యువ ఉద్యోగులతో పోలిస్తే, సీనియర్లు ఏఐని అలవర్చుకోవడం వెనుకబడ్డారని గుర్తించాం. కొత్త టెక్నాలజీ విషయంలో ఉద్యోగాలు పోతాయనే చర్చకు భయపడట్లేదు, దీన్ని అధిగమించేందుకు ఉద్యోగులు కూడా కొంత కష్ట పడాలని కోరుకుంటున్నామని వివరించారు. ఏఐని ఉపయోగించడం అంటే ఓపెన్ఏఈకి చెందిన చాట్‌జీపీటీ లాంటి ప్లాట్‌ఫామ్‌లకు సాధారణ ప్రాంప్ట్‌లను ఇవ్వడం మాత్రమే కాదు, దాంతో ఉపయోగపడే పరిష్కారాలను సాధించడం కూడా అని ఆయన పేర్కొన్నారు.

Next Story