- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tax wealthy: ధనవంతులపై పన్నులు పెంచండి..ఆర్థికవేత్త సంతోష్ మెహ్రోత్రా
ధనవంతులపై సర్‌చార్జీలు విధిస్తే ప్రభుత్వానికి అవసరమైన ఆదాయం రావడంతో పాటు సాధారణ ప్రజలపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

దిశ, బిజినెస్ బ్యూరో: పెట్రోల్, డీజిల్, బంగారంపై అధిక పన్నులు విధించడం కంటే అత్యంత సంపన్నులు, హై-నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్‌పై పన్నులు పెంచాలని ఆర్థికవేత్త, ఐక్యరాజ్యసమితి మాజీ సలహాదారు సంతోష్ మెహ్రోత్రా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎక్కువగా పరోక్ష పన్నులపై ఆధారపడుతోందని, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరగడమే కాకుండా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలపై అదనపు భారం పడుతోందని ఆయన అన్నారు. ధనవంతులపై సర్‌చార్జీలు విధిస్తే ప్రభుత్వానికి అవసరమైన ఆదాయం రావడంతో పాటు సాధారణ ప్రజలపై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు భారత ఆర్థికవ్యవస్థపై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉందని మెహ్రోత్రా హెచ్చరించారు. యుద్ధ పరిస్థితులు కొనసాగితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 150 డాలర్లను దాటే అవకాశం ఉందన్నారు. చమురు, గ్యాస్, ఎరువులు, ఎల్‌పీజీ సరఫరాల్లో అంతరాయాలు ఏర్పడితే ఎంఎస్ఎంఈలు, సిరామిక్స్, రెస్టారెంట్లు, రత్నాలు ఆభరణాల వంటి శ్రమ ఆధారిత రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పారు. దీనివల్ల ఉద్యోగ నష్టాలు పెరిగి, కార్మికులు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి రావచ్చన్నారు.
ఇక రూపాయి బలహీనతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని నెలల్లో రూపాయి విలువ డాలరుతో పోలిస్తే భారీగా బలహీనపడిందని, ఇదే ధోరణి కొనసాగితే వచ్చే త్రైమాసికంలో డాలర్ విలువ రూ. 100కు చేరే అవకాశం ఉందని హెచ్చరించారు. రూపాయి బలహీనత దిగుమతుల ఖర్చును పెంచి, ద్రవ్యోల్బణంపై మరింత ఒత్తిడి తీసుకురావచ్చని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడాలంటే ప్రభుత్వం పన్ను విధానాల్లో సమతుల్యత పాటిస్తూ, వినియోగం, ఉపాధిపై ప్రభావం తగ్గించే చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.






