Trump: అమెరికా టారిఫ్‌ల రీఫండ్ మొదలు

by S Gopi |

ట్రంప్ ప్రభుత్వం దిగుమతిదారులకు సుమారు 166 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలను వాపసు చేసే ప్రక్రియను ప్రారంభించింది.

Trump: అమెరికా టారిఫ్‌ల రీఫండ్ మొదలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ చట్టవిరుద్ధమని సుప్రీం కోర్టు ప్రకటించిన నేపథ్యంలో వాటిని రీఫండ్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ప్రారంభంలో టారిఫ్ విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆ దేశ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వం దిగుమతిదారులకు సుమారు 166 బిలియన్ డాలర్ల విలువైన సుంకాలను వాపసు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద విధించిన సుంకాలను చెల్లవని ప్రకటించింది. ఆ సుంకాల కింద వసూలు చేసిన బిలియన్ డాలర్లు చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. దీంతో అమెరికా చరిత్రలోనే అతిపెద్ద రీఫండ్ ప్రక్రియకు మార్గం సుగమమైంది.

ఈ భారీ రీఫండ్ ప్రక్రియను సులభతరం చేయడానికి, యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీఏపీఈ) అనే కొత్త సిస్టమ్‌ను ప్రారంభించింది. ఈ వ్యవస్థ ద్వారా ఒక్కో దరఖాస్తుకు వేర్వేరుగా చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకేసారి ఎలక్ట్రానిక్ చెల్లింపుల ద్వారా రీఫండ్ చేయనున్నారు. పాత విధానంతో పోలిస్తే వేగంగా డబ్బు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది. అమెరికా ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం, 3 లక్షలకు పైగా దిగుమతిదారులు దాదాపు 166 బిలియన్‌ డాలర్లను టారిఫ్ రూపంలో చెల్లించారు. అర్హత ఉన్న దిగుమతిదారులకు వడ్డీతో కలిపి వాపసు చేయనున్నారు. దరఖాస్తు ఆమోదం తర్వాత 60-90 రోజుల్లో వాపసు జరుగుతుంది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా కొంత ఆలస్యం కూడా అవ్వొచ్చని నిపుణులు వెల్లడించారు.

Next Story