Stock Market: స్టాక్ మార్కెట్ విలువలో భారత్‌ను అధిగమించిన తైవాన్

by S Gopi |

అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్‌ల తర్వాత ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా తైవాన్ అవతరించింది.

Stock Market: స్టాక్ మార్కెట్ విలువలో భారత్‌ను అధిగమించిన తైవాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తున్న వేళ, స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద చిప్‌మేకర్ 'తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ' (టీఎస్ఎంసీ) షేర్లు పుంజుకోవడంతో, తైవాన్ మార్కెట్ విలువ 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరుకుని భారత స్టాక్ మార్కెట్ 4.92 ట్రిలియన్ డాలర్లును అధిగమించింది. తద్వారా అమెరికా, చైనా, జపాన్, హాంకాంగ్‌ల తర్వాత ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా తైవాన్ అవతరించింది. ఏఐ రంగానికి అవసరమైన హార్డ్‌వేర్ తయారీలో తైవాన్ అగ్రస్థానంలో ఉండటమే ఈ మైలురాయికి ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీలో ఈ కంపెనీ దాదాపు 42 శాతం వాటాను కలిగి ఉంది. ఏఐకు కావాల్సిన అత్యాధునిక చిప్‌లను సరఫరా చేయడంలో టీఎస్ఎంసీదే ఆధిపత్యం. ఈ ఏడాది కంపెనీ షేర్లు ఏకంగా 49 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీనికి తోడు, తైవాన్ ప్రభుత్వం దేశీయ ఫండ్‌ల పెట్టుబడి పరిమితులను సడలిస్తూ తీసుకున్న నియంత్రణ మార్పులు కూడా కలిసొచ్చాయి.

మరోవైపు, భారత స్టాక్ మార్కెట్ ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, మందగిస్తున్న కార్పొరేట్ ఆదాయాలు, ఏఐ రంగంలో ప్రత్యక్షంగా బలమైన కంపెనీలు లేకపోవడం వంటి అంశాలు భారత్ మార్కెట్ వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, మార్కెట్ విలువలో తైవాన్ ముందున్నప్పటికీ, వాస్తవ ఆర్థిక సామర్థ్యం(జీడీపీ)లో భారత్‌ మెరుగైన స్థానంలోనే ఉందని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Next Story