Switzerland: భారత్‌కు అత్యంత అనుకూల దేశ హోదాను ఉపసంహరించుకున్న స్విట్జర్లాండ్

by S Gopi |

ఎంఎఫ్ఎన్ హోదా ఉపసంహరణ 2025, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Switzerland: భారత్‌కు అత్యంత అనుకూల దేశ హోదాను ఉపసంహరించుకున్న స్విట్జర్లాండ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: యూరప్ దేశం స్విట్జర్లాండ్ కీలక ప్రకటన చేసింది. భారత్‌కు గతంలో ఇచ్చిన అత్యంత అనుకూల దేశ(ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం ఎఫ్ఎంసీజీ కంపెనీ నెస్లె కేసు విషయంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్విట్జర్లాండ్ పేర్కొంది. ఎంఎఫ్ఎన్ హోదా ఉపసంహరణ 2025, జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే, స్విట్జర్లాండ్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ సంస్థలకు ప్రతికూల ప్రభావం ఉండనుంది. ఆయా కంపెనీలపై పన్నుల భారం పడనుంది. మరోవైపు భారత్‌లో ఉండే స్విట్జర్లాండ్ కంపెనీలకు కూడా ఇదే వర్తిస్తుంది. భారతీయ కంపెనీలు స్విట్జర్లాండ్‌లో ఆర్జించే ఆదాయం బట్టి పన్నులు ఉంటాయి. డబుల్ ట్యాక్సేసన్‌ను నివారించడానికి 1994లో స్విస్ కాన్ఫడరేషన్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగానే అత్యంత అనుకూల దేశం(ఎంఎఫ్ఎన్) హోదాను స్విట్జర్లాండ్ ఇచ్చింది. కానీ, ఇటీవల స్విస్ దేశానికి చెందిన నెస్లె కేసు వ్యవహారంలో భారత సుప్రీంకోర్టు ఆదాయ పన్ను చట్టంలో డబుల్ ట్యాక్సేసన్ ప్రస్తావన లేదని పేర్కొంది. ఈ కారణంగానే స్విట్జర్లాండ్ ఎంఎఫ్ఎన్ హోదాను వెనక్కు తీసుకుంది. దీనివల్ల స్విట్జర్లాండ్‌లో భారతీయ కంపెనీలు పొందే డివిడెండ్‌పై 10 శాతం పన్ను వరిస్తుంది. మరోవైపు స్విట్జర్లాండ్ నిర్ణయం వల్ల పెట్టుబడులపై ప్రభావం ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

Next Story