Swiggy: ఇన్‌స్టామార్ట్ డెలివరీ ఫీజును పెంచే యోచనలో స్విగ్గీ

by S Gopi |
Swiggy: ఇన్‌స్టామార్ట్ డెలివరీ ఫీజును పెంచే యోచనలో స్విగ్గీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తన క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టామార్ట్‌లో డెలివరీ ఫీజులను పెంచాలని భావిస్తోంది. దీనికి సంబంధించి కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్ఓ) రాహుల్ బోత్రా కంపెనీ ఆర్థిక ఫలితాల తర్వాత జరిగే అనలిస్ట్ కాల్స్‌లో ఈ విషయంపై సంకేతాలిచ్చారు. ఇన్‌స్టామార్ట్ ప్రస్తుతం రూ. 199 కంటే తక్కువ ఆర్డర్‌లపై డెలివరీ రుసుము కింద రూ. 30, స్మాల్ కార్ట్ ఫీజును రూ. 15, ఒక్కో ఆర్డర్‌కు ఫీజు కింద రూ. 6.5 వసూలు చేస్తోంది. రూ. 199 కంటే ఎక్కువ ఆర్డర్‌లపై, స్మాల్ కార్ట్ ఫీజు మినహాయించబడుతుంది. స్విగ్గీ వన్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే రూ. 199 కంటే ఎక్కువ మొత్తం ఆర్డర్‌పై ఉచితం డెలివరీ లభిస్తుంది. అయితే, డెలివరీ ఫీజు పెంపునకు సంబంధించి ఎప్పటి నుంచి ఉంటుందనే విషయాన్ని ఆయన పేర్కొనలేదు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ కోసం 15 శాతం నుంచి 20-22 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు చెప్పారు. క్విక్‌కామర్స్ విభాగంలో ఇప్పటికే మార్కెట్‌లో ఆధిపత్యం కలిగి ఉన్న జొమాటోకు చెందిన బ్లింక్ఇట్, జెప్టో వంటి కంపెనీలు కూడా ఇదే స్థాయిలో డెలివరీ ఫీజులను వసూలు చేస్తున్నాయి. బ్లింక్ఇట్ రూ. 199 వరకు ఆర్డర్లపై రూ. 30, అంతకంటే ఎక్కువ మొత్తంపై రూ. 16 వసూలు చేస్తోంది. జెప్టో రూ. 99 కంటే తక్కువ ఆర్డర్లపై స్మాల్ కార్ట్ ఫీజు, డెలివరీ ఫీకు రూ. 35 చొప్పున వసూలు చేస్తుంది. కాగా, స్విగ్గీ ఇప్పటికే తన ఫుడ్ డెలివరీ సేవల కోసం డెలివరీ ఫీజును ఐదు రెట్లు పెంచింది. గత 18 నెలల్లో ఆర్డర్‌పై రూ .2 నుంచి రూ. 10 వరకు పెంపు నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story