భారీ పతనంలో స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-27 05:03:28  IST  )

హైఫా పోర్ట్‌పై దాడుల వార్తలతో సెన్సెక్స్ 800 పాయింట్లు కుప్పకూలింది. ఒక్క రోజే రూ. 4 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.

భారీ పతనంలో స్టాక్ మార్కెట్లు.. ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్టాక్ మార్కెట్లు (Indian Stock Markets) భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా హైఫా పోర్ట్‌ (Haifa Port)పై దాడుల వార్తల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురై అమ్మకాలకు మొగ్గు చూపారు. నేడు ట్రేడింగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ. 4 లక్షల కోట్లు ఆవిరైపోయింది. దాదాపు 800 పాయింట్లకు పైగా పతనమై 74,400 స్థాయికి చేరుకుంది. ఇక నిఫ్టీ 23,100 స్థాయి కంటే దిగువకు పడిపోయి 23,025 వద్ద ట్రేడవుతోంది.

ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి వాల్యూ..

దేశీయ కరెన్సీ రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయికి పడిపోయింది. ఇవాళ ఉదయం రూపాయి 94.25 మార్కును తాకింది. విదేశీ ఇన్వెస్టర్లు (Foreign Investors) భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకోవడం, ముడిచమురు ధరలు పెరగడం రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయి. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 105 డాలర్ల పైనే కొనసాగుతోంది. ఇది భారత్ వంటి దిగుమతి దేశాలపై భారీ ఆర్థిక భారాన్ని పెంచుతోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు సుమారు రూ.1.21 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించి, సురక్షితమైన బంగారం వంటి ఆస్తుల వైపు మళ్లుతున్నారు. నిన్న అమెరికాలోని నాస్‌డాక్ సూచీ (NASDAQ Index) భారీగా నష్టపోవడం కూడా ఆసియా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ప్రధానంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, ఆటోమొబైల్ రంగ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే, కొన్ని ఐటీ కంపెనీలు, డిఫెన్స్ రంగ షేర్లు స్వల్పంగా లభపడ్డాయి.

Next Story