Stock Market: బడ్జెట్ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు

by S Gopi |

సోమవారం ట్రేడింగ్‌లో రోజంతా నష్టాల్లో కొనసాగించిన తర్వాత ఆఖర్లో ఒక్కసారిగా లాభాలకు మరాయి.

Stock Market: బడ్జెట్ నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. అంతకుముందు బడ్జెట్‌ సెషన్‌లో డెరివేటివ్స్‌పై పన్ను కారణంగా పడిపోయిన సూచీలు, ఒక్కరోజులోనే తిరిగి పుంజుకున్నాయి. పన్నులు దీర్ఘాకాలంలో సానుకూలమని నమ్మడం, బడ్జెట్‌లోని ఇతర అంశాలను సమీక్షించిన అనంతరం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. సోమవారం ట్రేడింగ్‌లో రోజంతా నష్టాల్లో కొనసాగించిన తర్వాత ఆఖర్లో ఒక్కసారిగా లాభాలకు మరాయి. ముఖ్యంగా బ్లూ-చిప్ ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, ఆటో షేర్లలో కొనుగోళ్లు కనిపించడంతో మదుపర్ల సంపద రూ. 5 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 455 లక్షల కోట్లకు చేరింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 943.52 పాయింట్లు ఎగసి 81,666 వద్ద, నిఫ్టీ 262.95 పాయింట్లు లాభపడి 25,088కి చేరుకుంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 91.50 వద్ద ఉంది. అంతర్జాతీయంగా కూడా ముడిచమురు ధరలు దిగిరావడం కూడా మార్కెట్లకు ఉపశమనం కలిగించిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. బీఎస్ఈలో పవర్ గ్రిడ్ 7.61 శాతం, అదానీ పోర్ట్స్ 4.76 శాతం పెరిగాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎల్అండ్‌టీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ లాభపడిన వాటిలో ఉన్నాయి.

రూ. 50,000 క్షీణించిన వెండి

కొంతకాలంగా రికార్డు గరిష్ఠాలతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా వెండి ధరలు గరిష్ఠ స్థాయిల నుంచి దాదాపు 30 శాతం మేర పతనమైంది. సోమవారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో వరుసగా మూడో రోజు లాభాల స్వీకరణ కారణంగా వెండి మరింత క్షీణించింది. ఇక, బంగారం మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. వరుస రెండు సెషన్లలో తగ్గిన పసిడి సోమవారం హెచ్చుతగ్గులకు లోనైంది. దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం రూ. 1.53 లక్షలకు చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాములు రూ. 7,410 తగ్గి రూ. 1,53,320కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములు రూ. 6,800 తగ్గి రూ. 1,40,400కి చేరుకుంది. వెండి ఏకంగా రూ. 50,000 క్షీణించడంతో కిలో రూ. 3 లక్షలకు చేరింది.

Next Story