- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు పెరగడం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచింది.

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
- సెన్సెక్స్ 1,837 పాయింట్లు, నిఫ్టీ 600 పాయింట్లు డౌన్
- రూ. 14 లక్షల కోట్లు కోల్పోయిన ఇన్వెస్టర్లు
దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో యుద్ధ భయాలు కమ్ముకున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు భారీగా పెరగడం, విదేశీ ఇన్వెస్టర్లు మన ఈక్విటీల నుంచి నిధులను వెనక్కి తీసుకెళ్లడంతో సూచీలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఆదివారం హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని, లేకుంటే ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు హెచ్చరించడం, దీనికి కౌంటర్‌గా ఇరాన్ కూడా దాడులు తప్పవని బెదిరించడంతో యుద్ధం మరింత తీవ్రమవుతుందనే భయాలు పెరిగాయి. ఈ క్రమంలోనే సోమవారం ట్రేడింగ్ ఏకంగా 1,800 పాయింట్లకు పైగా కుదేలైంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మొదలైన నాటి నుంచి సెన్సెక్స్ 8 వేలకు పైగా దెబ్బతినగా, నిఫ్టీ 2,500 పాయింట్లకు వరకు క్షీణించింది.
యుద్ధ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు పెరగడం కూడా మార్కెట్లపై ఒత్తిడి పెంచింది. చమురు ధరలు పెరుగుతూ పోతుంటే ప్రపంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం, ద్రవ్యోల్బణం పెరగడం, వృద్ధి క్షీణిస్తుందనే ఆందోళనలు ఎక్కువయ్యాయి. మరోవైపు డాలర్ బలపడుతుండటంతో దేశీయంగా మన ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరిస్తున్నారు. ఈ నెలలో ఇప్పటికే రూ. 95 వేల కోట్లకు పైగా నిధులను వెనక్కి తీసుకెళ్లడం ఆందోళనలను పెంచింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1836.57 పాయింట్లు కుప్పకూలి 72,696 వద్ద, నిఫ్టీ 601.85 పాయింట్లు క్షీణించి 22,512 వద్ద ముగిశాయి. స్టాక్ మార్కెట్ల పతనం కారణంగా సోమవారం ఒక్కరోజే దేశీయ మదుపర్లు ఏకంగా రూ. 14 లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 429 లక్షల కోట్ల నుంచి రూ. 415 లక్షల కోట్లకు పడిపోయింది. భౌగోళిక ఉద్రిక్తత పరిణామాలతో భారత కరెన్సీ మరింత బలహీనపడి ఓ దశలో తొలిసారి డాలరుతో పోలిస్తే తొలిసారి రూ. 94 మార్కు తాకింది. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ మార్కెట్లు ముగిసే సమయానికి రూ. 93.26 వద్ద నిలిచింది.






