PSBs: రికార్డు లాభాలతో దూసుకెళ్తున్న ప్రభుత్వ బ్యాంకులు

by S Gopi |

రూ.1.98 లక్షల కోట్లతో పీఎస్‌బీలు వరుసగా నాలుగో ఏడాది మెరుగైన లాభాలను కొనసాగించాయి.

PSBs: రికార్డు లాభాలతో దూసుకెళ్తున్న ప్రభుత్వ బ్యాంకులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. రూ.1.98 లక్షల కోట్లతో పీఎస్‌బీలు వరుసగా నాలుగో ఏడాది మెరుగైన లాభాలను కొనసాగించాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, మెరుగైన ఆస్తుల నాణ్యత, బలమైన రుణ వృద్ధి, అధిక వడ్డీ ఆదాయం వంటి అంశాలు లాభాల వృద్ధికి దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పీఎస్‌బీల మొత్తం నిర్వహణ లాభం రూ.3.21 లక్షల కోట్లకు చేరుకోగా, నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 11.1 శాతం పుంజుకుందని వెల్లడించింది. వ్యాపార విస్తరణలో కూడా ప్రభుత్వ బ్యాంకులు పురోగతి సాధించాయి. ఈ ఏడాది మార్చి నాటికి బ్యాంకుల మొత్తం వ్యాపారం రూ.283.3 లక్షల కోట్లకు చేరగా, డిపాజిట్లు 10.6 శాతం పెరిగి రూ.156.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అదే సమయంలో రుణాల పంపిణీ 15.7 శాతం వృద్ధితో రూ.127 లక్షల కోట్లకు పెరగడం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు, రిటైల్ రంగాల్లో లోన్ డిమాండ్ బలంగా కొనసాగినట్లు పేర్కొన్నాయి.

Next Story