Starlink: భారత్‌లో స్టార్‌లింక్ సేవల కోసం నెలకు రూ. 3,000 ప్లాన్

by S Gopi |

కస్టమర్లు కంపెనీ సెట్-అప్ అంటే డేటా రిసీవర్ కోసం రూ. 33,000 వన్-టైమ్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

Starlink: భారత్‌లో స్టార్‌లింక్ సేవల కోసం నెలకు రూ. 3,000 ప్లాన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ త్వరలో దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించనున్న సంగతి తెలిసిందే. గతవారమే టెలికాం విభాగం దానికోసం అనుమతులు కూడా ఇచ్చింది. భారతదేశ టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ నుంచి కీలకమైన లైసెన్స్‌ను పొందడంతో దేశంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలనే కంపెనీ ప్రణాళికలకు ముఖ్యమైన ముందడుగు పడింది. తాజాగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు సంబంధించి స్టార్‌లింక్ డేటా ప్లాన్ రూ. 3,000 ప్రారంభ ధరతో వినియోగదారులకు అపరిమిత డేటా ప్లాన్‌లను అందించనున్నట్టు సమాచారం. అయితే, కస్టమర్లు కంపెనీ సెట్-అప్ అంటే డేటా రిసీవర్ కోసం రూ. 33,000 వన్-టైమ్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు, కంపెనీ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్-స్పేస్) నుంచి అనుమతులు తీసుకోవాలి. అంతేకాకుండా, స్టార్‌లింక్ స్పెక్ట్రమ్ కేటాయింపును, దేశీయంగా కార్యకలాపాలను ప్రారంభించడానికి గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం, దేశంలోని ఏ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌కు స్పెక్ట్రమ్ కేటాయింపుతో పాటు అవసరమైన గ్రౌండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేదు.

స్టార్‌లింక్ కిట్

వివిధ నివేదికల ప్రకారం, స్టార్‌లింక్ సెట్-అప్ లేదా కిట్‌లో 4 ప్రధాన పరికరాలు ఉంటాయి. వీటిలో స్టార్‌లింక్ డిష్, వై-ఫై రౌటర్, పవర్ సప్లై కేబుల్, మౌంటింగ్ ట్రైపాడ్ వస్తాయి. స్టార్‌లింక్ డిష్ ఇంటి పైకప్పు భాగంలో అమరుస్తారు. ఇది ప్రస్తుతం వాడుతున్న డీటీహెచ్ గొడుగు లాగానే ఉంటుంది. దీనిపై అంతరిక్షం నుంచి వచ్చే సిగ్నల్స్‌ పడి, కిట్‌తో వచ్చే వై-ఫై రౌటర్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌ సహా ఇతర డివైజ్‌లకు వై-ఫై ఇంటర్నెట్ అందుతుంది.

Next Story