Starlink: ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌కు కేంద్రం అనుమతులు

by S Gopi |

దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లో ట్రయల్‌ స్పెక్ట్రమ్‌ మంజూరు చేయనున్నట్టు టెలికాం విభాగం వర్గాలు తెలిపాయి.

Starlink: ఎలన్ మస్క్ స్టార్‌లింక్‌కు కేంద్రం అనుమతులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు ప్రపంచ సంపన్నుడు ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. త్వరలో దేశీయంగా స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి శుక్రవారం గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్‌ను టెలికాం విభాగం నుంచి అందుకుంది. యూటెల్‌సాట్‌కు చెందిన వన్‌వెబ్, రిలయన్స్ జియోలకు ఆమోదం లభించిన తర్వాత, భారత టెలికమ్యూనికేషన్స్ శాఖ నుంచి శాటిలైట్ ఇంటర్నెట్ సేవల లైసెన్స్ పొందిన మూడవ కంపెనీగా స్టార్‌లింక్ నిలిచింది. దరఖాస్తు చేసుకున్న 20 రోజుల్లో ట్రయల్‌ స్పెక్ట్రమ్‌ మంజూరు చేయనున్నట్టు టెలికాం విభాగం వర్గాలు తెలిపాయి. స్టార్‌లింక్ 2021 నుంచి భారత శాటిలైట్ కమ్యూనికేషన్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తోంది. స్టార్‌లింక్ ప్రస్తుతం 125 దేశాల్లో శాటిలైట్ సేవలందిస్తోంది. మరో బిలియనీర్ జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని అమెజాన్ కైపర్ కూడా దరఖాస్తు చేసుకుంది. అయితే, ఇంకా ఆ దరఖాస్తు పెండింగ్‌లో ఉంది. ఇక, యాపిల్‌కు చెందిన గ్లోబల్‌స్టార్ కూడా దేశంలో శాటిలైట్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలందించేందుకు ఆసక్తి చూపిస్తున్న కంపెనీల జాబితాలో ఉంది.

Next Story