Starlink: దేశంలో స్టార్‌లింక్ 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే ఇవ్వగలదు: టెలికాం శాఖ

by S Gopi |

నెలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం రూ. 3,000 వరకు వెచ్చించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు.

Starlink: దేశంలో స్టార్‌లింక్ 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే ఇవ్వగలదు: టెలికాం శాఖ
X

దిశ, బిజినెస్ బ్యూరో: బిలియనీర్ ఎలన్ మస్క్ నేతృత్వంలోని శాటిలైట్ కమ్యూనికేషన్ సేవల కంపెనీ స్టార్‌లింక్ భారత్‌లో 20 లక్షల కనెక్షన్‌లను మాత్రమే ఇవ్వగలదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సోమవారం వెల్లడించారు. అలాగే, గరిష్ఠంగా 200ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇస్తుందని తెలిపారు. ఇదే సమయంలో స్టార్‌లింక్ సేవలు భారత్‌లోకి అడుగుపెట్టడం వల్ల దేశీయ బీఎస్ఎన్ఎల్ సహా మన ప్రైవేట్ టెలికాం కంపెనీలపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. స్టార్‌లింక్ సేవలు మొదట్లో ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నెలకు స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కోసం రూ. 3,000 వరకు వెచ్చించాల్సి ఉంటుందని మంత్రి వివరించారు. అదే బీఎస్ఎన్ఎల్ అధిక ఉనికిని కలిగిన గ్రామీణ, మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా శాట్‌కామ్ సేవలందించాలని భావిస్తున్నాం. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల విస్తరణ పూర్తయింది. స్టార్‌లింక్ కనెక్షన్లు దాని ప్రస్తుత సామర్థ్యం ఆధారంగా పరిమితం చేసినట్టు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ విషయంలో మార్కెట్ వాటాను పెంచుకునే దిశగా నిర్ణయాలు ఉంటాయని, ఇప్పటివరకైతే బీఎస్ఎన్ఎల్‌కు సంబంధించి టారిఫ్‌లను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని చంద్రశేఖర్ వెల్లడించారు. 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో బీఎస్ఎన్ఎల్ ఆదాయం 20-30 శాతం పెరిగింది. టెక్నాలజీ పరంగా కూడా మెరుగుపడుతోందన్నారు.

Next Story