Starlink: దేశీయంగా నియామకాలు ప్రారంభించిన స్టార్‌లింక్

by S Gopi |

త్వరలో కమర్షియల్‌గా సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతూ, బెంగళూరు కేంద్రంగా పనిచేయడానికి ఈ నియామకాలను చేపట్టింది.

Starlink: దేశీయంగా నియామకాలు ప్రారంభించిన స్టార్‌లింక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ త్వరలో దేశీయంగా కార్యకలాపాలు ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొందిన కంపెనీ, తాజాగా మొదటి దశ నియామకాలను ప్రారంభించింది. ఇది దేశ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్‌లో కంపెనీ ప్రవేశానికి ఒక ప్రధాన అడుగు కానుంది. త్వరలో కమర్షియల్‌గా సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతూ, బెంగళూరు కేంద్రంగా పనిచేయడానికి ఈ నియామకాలను చేపట్టింది. తొలుత తక్కువ లేటెన్సీ ఉన్న బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని స్టార్‌లింక్ భావిస్తోంది. అందులో భాగంగా ఫైనాన్స్, అకౌంటింగ్ ఉద్యోగాలపై దృష్టి సారించింది. అకౌంటింగ్ మేనేజర్, పేమెంట్ మేనేజర్, ట్యాక్స్ మేనేజర్, సీనియర్ ట్రెజరీ అసిస్ట్ వంటి పాత్రల కోసం నియామకాలు జరుగుతాయని కంపెనీ తెలిపింది. కాగా, వచ్చే ఏడాది ప్రారంభం నాటికి స్టార్‌లింక్ దేశీయంగా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించే అవకాశం ఉంది. ఎర్త్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నుంచి కీలక అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు, ఎలన్ మస్క్‌కు చెందిన ఈవీ బ్రాండ్ టెస్లాకు సంబంధించి కూడా నియామకాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దేశీయంగా కంపెనీ మోడల్ వై కారును విడుదల చేసిన తర్వాత, కొత్తగా 34 మంది ఉద్యోగుల కోసం ప్రకటన జారీ చేసింది. సప్లై చెయిన్, ఇంజనీరింగ్, ఐటీ, కస్టమర్ సపోర్ట్, సేల్స్, ఏఐ, రోబోటిక్స్, ఛార్జింగ్, హెచ్ఆర్, వెహికల్ సర్వీస్ లాంటి పలు విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నాయి.

Next Story