Starbucks: నాలుగు నెలలకు రూ. 828 కోట్ల జీతం.. యాపిల్, గూగుల్ సీఈఓల కంటే అత్యధికం

by S Gopi |

నికోల్ జీతంలో సుమారు 94 శాత స్టాక్ అవార్డుల ద్వారా అందుకున్నారు.

Starbucks:  నాలుగు నెలలకు రూ. 828 కోట్ల జీతం.. యాపిల్, గూగుల్ సీఈఓల కంటే అత్యధికం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కాఫీ బ్రాండ్ స్టార్‌బక్స్ సీఈఓ బ్రయాన్ నికోల్ అమెరికా కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక వేతనం తీసుకుని రికార్డు సృష్టించారు. గతేడాది సంస్థ బాధ్యతలు చేపట్టిన ఆయన నాలుగు నెలల కోసం ఏకంగా 96 మిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 828 కోట్లు) అందుకున్నారు. ఈ మేరకు స్టార్‌బక్స్ యాజమాన్యం నికోల్‌కు ప్యాకేజీ అందజేసింది. బ్లూమ్‌బర్గ్ ప్రకారం, ఈ మొత్తం గ్లోబల్ టెక్ దిగ్గజాలైన యాపిల్ సీఈఓ టిమ్ కుక్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(దాదాపు రూ. 650 కోట్ల) కంటే అత్యధికం. నికోల్ జీతంలో సుమారు 94 శాత స్టాక్ అవార్డుల ద్వారా అందుకున్నారు. మిగిలిన మొత్తం ఇతర చెల్లింపులు, 5 మిలియన్ డాలర్లు బోనస్ రూపంలో పొందారు. గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ సీఈఓగా బాధ్యతలు తీసుకున్న బ్రయాన్ నికోల్, అధిక వేతనంతో అమెరికాలో ఎక్కువ జీతం తీసుకునే సీఈఓల్లో మొదటి 20 మందిలో ఒకరిగా నిలిచారు. అమ్మకాల్లో భారీ క్షీణత కారణంగా ఇదివరకు స్టార్‌బక్స్ సీఈఓగా ఉన్న భారత సంతతి వ్యక్తి లక్ష్మన్ నరసింహన్‌ను యాజమాన్యం తొలగించింది. వ్యాపారాన్ని మరింత లాభదాయకంగా మార్చేందుకు నికోల్‌కు బాధ్యతలు అప్పగించింది. అయితే, నికోల్ సంస్థ ప్రధాన కార్యాలయం ఉన్న సీటెల్‌కు వెళ్లాల్సిన పనిలేకుండా, ఆయన ఉన్న చోటే తాత్కాలిక నివాసానికి చెల్లిస్తోంది. అంతేకాకుండా కంపెనీ జెట్‌ను ఉపయోగించేందుకు కూడా అంగీకరించింది. తాజా డేటా ప్రకారం, నికోల్ నివాసం కోసం కంపెనీ 1.43 లక్షల డాలర్లను(రూ. 1.23 కోట్ల) చెల్లిస్తోంది. నికోల్‌ను నియామించే సమయంలో వార్షిక వేతన ప్యాకేజీ సుమారు 113 మిలియన్ డాలర్లు ఉంటుందని బ్లూమ్‌బర్గ్ అంచనా వేసింది.

Next Story