SpaceX: స్పేస్ఎక్స్ ఐపీఓతో కోటీశ్వరులు కానున్న వేలాది మంది ఉద్యోగులు

by S Gopi |

కంపెనీలో పనిచేస్తున్న, పనిచేసి విడిచిపెట్టిన సుమారు 4,400 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాబోతున్నారు.

SpaceX: స్పేస్ఎక్స్ ఐపీఓతో కోటీశ్వరులు కానున్న వేలాది మంది ఉద్యోగులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఐపీఓకు సిద్ధమైంది. సాధారణంగా ఏదైనా పెద్ద కంపెనీ మార్కెట్లోకి వస్తే కేవలం ఓనర్లు, టాప్ బాస్‌లు మాత్రమే అపర కుబేరులు అవుతుంటారు. కానీ ఎలాన్ మస్క్ తన కంపెనీలో ఒక సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. స్పేస్‌ఎక్స్ విలువను మార్కెట్ విశ్లేషకులు సుమారు 1.77 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన కంపెనీ ఒక్కో షేరును 135 డాలర్ల ధరతో మార్కెట్లోకి తెస్తే, కేవలం ఎలాన్ మస్క్ మాత్రమే కాదు.. కంపెనీలో పనిచేస్తున్న, పనిచేసి విడిచిపెట్టిన సుమారు 4,400 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాబోతున్నారు. వీరిలో దాదాపు 400 మంది ఉద్యోగుల షేర్ల విలువ ఏకంగా 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 958 కోట్లు) దాటవచ్చని 'న్యూయార్క్ టైమ్స్' నివేదిక వెల్లడించింది.

దీనికి కారణం స్పేస్‌ఎక్స్ తన ఉద్యోగులకు జీతంతో పాటు కంపెనీ షేర్లను కూడా భారీగా కేటాయించడమే. ఉదాహరణకు, 2011లో కంపెనీలో చేరిన ట్రెవర్ హైస్ అనే సాధారణ ఉద్యోగికి జీతం ప్యాకేజీలో భాగంగా లక్షకు పైగా షేర్లు వచ్చాయి. ఇప్పుడు ఐపీఓ రేటు ప్రకారం చూసుకుంటే ఆయన ఒక్కడి ఆస్తి విలువే ఒక్కసారిగా 13.5 మిలియన్ డాలర్లకు (రూ. 129 కోట్లకు పైగా) చేరుకుంటుంది. ఈ ఐపీఓ కేవలం ఉద్యోగులకే కాదు, సాధారణ రిటైల్ పెట్టుబడిదారులకు కూడా ఒక సువర్ణ అవకాశం కానుంది. సాధారణంగా ఐపీఓలలో చిన్న ఇన్వెస్టర్లకు చాలా తక్కువ షేర్లు ఇస్తారు, కానీ స్పేస్‌ఎక్స్ ఏకంగా 30 శాతం షేర్లను సామాన్యుల కోసం కేటాయించే యోచనలో ఉంది. ఈ మెగా లిస్టింగ్‌తో కంపెనీలో 42 శాతం వాటా ఉన్న ఎలాన్ మస్క్ సంపద ఒక్కసారిగా 740 బిలియన్ డాలర్ల(రూ. 79 లక్షల కోట్ల)కు చేరి, ప్రపంచ బిజినెస్ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. మార్కెట్ నుంచి దాదాపు 75 బిలియన్ డాలర్ల నిధులు వసూలు చేయడమే లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓ, ప్రపంచ స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే అతిపెద్ద 'గ్రాండ్ ఎంట్రీ'గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story