Economy: భారత వృద్ధిని 6.3 శాతానికి తగ్గించిన ఎస్అండ్‌పీ

by S Gopi |

ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కి దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది.

Economy: భారత వృద్ధిని 6.3 శాతానికి తగ్గించిన ఎస్అండ్‌పీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇటీవల భారత వృద్ధి అంచనాలను వివిధ రేటింగ్ సంస్థలు సవరిస్తున్నాయి. తాజాగా ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సైతం భారత వృద్ధిని 0.2 శాతం తగ్గించింది. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న సుంకాల విధానం వల్ల అనిశ్చితి ఏర్పడటం, ప్రపంచ ఆర్థికవ్యవస్థపై ప్రభావం, తద్వారా మన దేశ వృద్ధిపై కూడా ప్రతికూలత ఉండవచ్చని ఎస్అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ వివరించింది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కి దేశ జీడీపీ 6.5 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గవచ్చని పేర్కొంది. అంతకుముందు మార్చి నెలలో ఎస్అండ్‌పీ భారత వృద్ధిని 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది అంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి తిరిగి 6.5 శాతంగా నమోదవుతుందని వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అనూహ్య పరస్పర సుంకం నిర్ణయంతో ప్రపంచ వృద్ధి బలహీనపడుతుందని, అన్ని దేశాలు రక్షణవాద విధానాలను అనుసరించడం వల్ల ఏ ఆర్థికవ్యవస్థా అనుకున్న స్థాయిలో వృద్ధి సాధించకపోవచ్చని అభిప్రాయపడింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని ప్రధాన ఆర్థికవ్యవస్థలలో చైనా 2025లో 3.5 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. కరెన్సీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గుల కారణంగా 2024లో అమెరికా డాలరుతో పోలిస్తే రూ. 86.64 వద్ద ఉన్న భారత రూపాయి 2025 చివరి నాటికి రూ. 88 స్థాయికి చేరవచ్చని ఎస్అండ్‌పీ రేటింగ్ అంచనా కట్టింది.

Next Story