SIP: రికార్డు స్థాయికి సిప్ పెట్టుబడులు

by S Gopi |

ముఖ్యంగా ఈక్విటీ, హైబ్రిడ్ పథకాలపై మదుపర్లలో ఎక్కువ ఆసక్తి కనిపించింది.

SIP: రికార్డు స్థాయికి సిప్ పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గతేడాది ఆఖర్లో స్టాక్ మార్కెట్లు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, దేశీయ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పెట్టుబడులపై విశ్వాసాన్ని కొనసాగించారు. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) డేటా ప్రకారం, రిటైల్ పెట్టుబడిదారులు రికార్డు స్థాయిలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) పెట్టుబడులు నమోదయ్యాయి. ముఖ్యంగా ఈక్విటీ, హైబ్రిడ్ పథకాలపై మదుపర్లలో ఎక్కువ ఆసక్తి కనిపించింది. డిసెంబర్‌లో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తులు రూ. 80.23 లక్షల కోట్లుగా ఉన్నాయి. డెట్ ఫండ్స్ నుండి నిధులు తరలిపోవడం వల్ల నవంబర్ కంటే కొంచెం తక్కువైనప్పటికీ, సగటు ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి. ఇందులో అత్యధికంగా సిప్ పెట్టుబడులు రికార్డు స్థాయిలో కొనసాగాయి. నెలవారీ సిప్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 31,001 కోట్లకు చేరుకున్నాయి. దీంతో మొత్తం సిప్ ఆస్తులు రూ. 16.63 లక్షల కోట్లకు పెరిగాయి. అదేవిధంగా సిప్ ఖాతాల సంఖ్య దాదాపు 9.8 కోట్లకు చేరాయని, ఈ ధోరణి దేశంలోని చాలామందికి సాధారణ నెలవారీ పెట్టుబడి ఒక అలవాటుగా మారడాన్ని గమనించవచ్చని యాంఫీ అభిప్రాయపడింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్లను ఇష్టపడుతున్నారు. ఈక్విటీ ఇన్‌ఫ్లోలు వరుసగా 58వ నెల కూడా సానుకూలంగా ఉన్నాయి. కొందరు పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకున్నప్పటికీ, మొత్తం ఈ విభాగంలో పెట్టుబడులు కొనసాగుతున్నాయని యాంఫీ పేర్కొంది.

Next Story