Silver: రికార్డు గరిష్టాల నుంచి పడిపోయిన వెండి

by S Gopi |

ఇటీవల ర్యాలీ తర్వాత చాలామంది పెట్టుబడిదారులు వెండి, బంగారం లాంటి లోహాల నుంచి లాభాల స్వీకరణకు సిద్ధపడ్డారు.

Silver: రికార్డు గరిష్టాల నుంచి పడిపోయిన వెండి
X

దిశ, బిజినెస్ బ్యూరో: రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న వెండి ధరలకు బ్రేకులు పడ్డాయి. అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనపడటంతో పాటు ఇటీవల ర్యాలీ తర్వాత చాలామంది పెట్టుబడిదారులు వెండి, బంగారం లాంటి లోహాల నుంచి లాభాల స్వీకరణకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు రోజుల పాటు పెరిగిన వెండి ధరలు సోమవారం కిలోకు రూ. 4,000 వరకు క్షీణించి రూ. 2,81,000కి చేరింది. మరోవైపు బంగారం ధరలు కూడా క్షీణించాయి. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 1,39,400గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 3,170 క్షీణించి రూ. 1,39,250కి చేరింది. ఆభారణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 2,900 పడిపోయి రూ.1,27,650గా ఉంది. రికార్డు స్థాయిలో జరిగిన ర్యాలీ తర్వాత వ్యాపారులు లాభాల స్వీకరణకు పాల్పడటం, యూరోపియన్ ట్రేడింగ్ సెషన్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు గరిష్టాల నుండి వెనక్కి తగ్గాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. గ్లోబల్ మార్కెట్లలోనూ వెండి ఔన్స్ 73.71 డాలర్లకు చేరింది. సోమవారం ట్రేడింగ్ సమయంలో 80 డాలర్లను తాకినప్పటికీ ప్రాఫిట్ బుకింగ్ కారణంగా క్షీణించాయి. ఔన్స్ బంగారం కూడా 4,530.38 డాలర్ల వద్ద ఉంది.

Next Story