Silver Demand: వెండికి పెరుగుతున్న గిరాకీ

by S Gopi |

గిరాకీకి తగిన స్థాయిలో వెండి లోటు నమోదవడం ఇది వరుసగా నాలుగో ఏడాది అని, ఫలితంగా ధరలు పెరుగుతాయని నివేదిక పేర్కొంది.

Silver Demand: వెండికి పెరుగుతున్న గిరాకీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: అధిక డిమాండ్‌కు తోడు తగ్గుతున్న సరఫరా వంటి కారణాలతో వెండి ధరలు మరింత పెరగనున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా ఈ ఏడాది చివరి నాటికి వెండి మార్కెట్లో 3,339 టన్నుల లోటు ఏర్పడవచ్చని ఐసీఐసీఐ ఈటీఎఫ్ నివేదిక అభిప్రాయపడింది. గిరాకీకి తగిన స్థాయిలో వెండి లోటు నమోదవడం ఇది వరుసగా నాలుగో ఏడాది అని, ఫలితంగా ధరలు పెరుగుతాయని నివేదిక పేర్కొంది. అయితే, లోటు మొత్తంలో వ్యత్యాసం ఉందని, 2022లో దేశీయంగా సరఫరా, డిమాండ్‌కు తగినంత లేక 7,076 టన్నులు లోటు నమోదవగా, 2025 నాటికి ఇది 3,339 టన్నులకు తగ్గింది. పారిశ్రామిక అవసరాలకు, ముఖ్యంగా విద్యుత్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో అవసరం పెరగడం వల్ల వెండి గిరాకీ ఊపందుకుంది. ఈ పరిశ్రమల నుంచి వెండి వినియోగం 2016-2024 మధ్య 49 శాతం వృద్ధి కనిపించింది. వీటితో పాటు ఫోటోవోల్టాయిక్స్ రంగం అంటే సోలార్ ప్యానెల్ పరిశ్రమ నుంచి అధిక డిమాండ్ ఉంది. అంతేకాకుండా ఫార్మా, వాటర్ ప్యూరిఫికేషన్, వెండి, ఆభరణాలు, నాణెలు, అలంకరణ వస్తువుల తయారీకి గిరాకీ ఎక్కువగా ఉంది. బుధవారం సాయంత్రానికి దేశంలో వెండి ధర కిలో రూ. 1,18,000 వద్ద ఉంది.

దిగొస్తున్న పసిడి

మరోవైపు, బంగారం ధరలు ఈ వారం స్వల్పంగా దిగొచ్చాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, అంతర్జాతీయ పరిణామాలు బలహీనపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెమ్మదించడం, ప్రపంచ ధోరణులకు అనుగుణంగా వ్యాపారులు అమ్మకాలకు ఎగబడటంతో బుధవారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ.300 తగ్గి రూ.98,950కి చేరుకున్నాయి. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 250 తగ్గి రూ. 90,700కి చేరుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన తర్వాత భౌగోళిక రాజకీయ ఆందోళనలు తగ్గాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఉన్న బంగారానికి డిమాండ్ తగ్గింది. తద్వారా బంగారం ధరలు రెండు వారాల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లలోనూ స్పాట్ బంగారం స్వల్పంగా తగ్గి ఔన్సుకు 3,322.56 డాలర్లకు చేరుకుంది.

Next Story