Silver: ఒక్కరోజే రూ. 23 వేలు పెరిగిన వెండి

by S Gopi |   (  Updated:2026-01-27 15:35:19  IST  )

ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, పారిశ్రామిక డిమాండ్ వంటి పరిస్థితుల కారణంగా వెండి ధరలు ఈ నెలలో ఇప్పటివరకు 18 శాతం పెరిగాయి.

Silver: ఒక్కరోజే రూ. 23 వేలు పెరిగిన వెండి
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మార్కెట్లో వెండి ధరలు మరో కొత్త మైలురాయిని అధిగమించాయి. ఒక రోజు సెలవు తర్వాత ప్రారంభమైన ట్రేడింగ్ సెషన్‌లో ఎంసీఎక్స్ వెండి కిలో ఏకంగా రూ. 23 వేలకు పైగి రూ. 3.65 లక్షలకు కొత్త జీవితకాల గరిష్ఠానికి చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం వెండి కిలో రూ. 22 వేలు పెరిగి రూ. 3.87 లక్షలకు చేరింది. ఇదే సమయంలో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు స్వల్పంగా రూ. 770 తగ్గి రూ. 1,62,060కి చేరింది. ఆభరణాల తయారీ ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి రూ. 700 తగ్గి రూ. 1,48,450 వద్ద ఉంది. ప్రపంచ ఆర్థిక, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, పారిశ్రామిక డిమాండ్ వంటి పరిస్థితుల కారణంగా వెండి ధరలు ఈ నెలలో ఇప్పటివరకు 18 శాతం పెరిగాయి. సరఫరా పరిమితం కావడం, ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకునే సామర్థ్యం పెరగడం కూడా ఇందుకు మద్దతిచ్చాయి. గ్లోబల్ మార్కెట్లలోనూ వెండి ధరలు భారీగా పెరిగాయి. గతేడాది జనవరిలో ఔన్స్ వెండి 30 డాలర్లు ఉండగా, ప్రస్తుతం ఇది ఏకంగా 111 డాలర్లకు చేరింది. కేవలం ఏడాది వ్యవధిలో వీటి ధరలు 270 శాతం పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 50 శాతం పెరిగింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 5,071 డాలర్లతో స్వల్పంగా దిగొచ్చింది.

మరోవైపు, భారత ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందించ సానుకూల సంకేతాలతో పాటు ప్రతిష్టాత్మక ఇండియా-ఈయూ డీల్ లాభాలకు కారణమయ్యాయి. ఇదే సమయంలో భారత కరెన్సీ రూపాయి కొంత బలపడటం, ముడిచమురు ధరలు దిగి రావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పుంజుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 319.78 పాయింట్లు పెరిగి 81,857 వద్ద, నిఫ్టీ 126.75 పాయింట్లు లాభపడి 25,175 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 91.58 వద్ద ఉంది.

Next Story