- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Silver: ఒక్కరోజే రూ. 20 వేలు తగ్గిన వెండి
గురువారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో వెండి, బంగారం ధరలు ఏకంగా 10 శాతం వరకు క్షీణతను చూశాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మార్కెట్లలో బలహీనమైన ధోరణి, అమెరికన్ డాలర్ పుంజుకోవడంతో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. గురువారం ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో వెండి, బంగారం ధరలు ఏకంగా 10 శాతం వరకు క్షీణతను చూశాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో మార్చి డెలివరీకి సంబంధించిన వెండి ధర కిలో రూ. 26,850(10 శాతం) తగ్గి రూ. 2,42,000కి చేరింది. అదేవిధంగా, ఏప్రిల్ కాంట్రాక్టుకు సంబంధించిన బంగారం ధర 1.51 శాతం తగ్గి 10 గ్రాములు రూ. 1,50,736కి పడిపోయింది. కమొడిటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, తీవ్ర అస్థిరత ఏర్పడటంతో బంగారం, వెండి ధరలు ఇటీవలి లాభాలను కోల్పోయాయని ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రేనిషా చైనాని అన్నారు. గ్లోబల్ మార్కెట్లలోనూ ఔన్స్ వెండి 14 శాతం క్షీణించి 73 డాలర్లకు చేరింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1.61 శాతం తగ్గి 4,870.9 డాలర్లకు చేరుకుంది. రిటైల్ మార్కెట్లకు సంబంధించి దేశ రాజధని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములు రూ. 1.54 లక్షలుగా ఉంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 5,020 తగ్గి రూ. 1,54,530గా ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 4,600 తగ్గి రూ. 1,41,550కి చేరింది. వెండి రూ. 20 వేలు క్షీణించడంతో కిలో రూ. 3 లక్షలకు చేరుకుంది.
మరోవైపు, భారతీయ స్టాక్ మార్కెట్లకు మరోసారి నష్టాలు ఎదురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, కీలక షేర్లలో అమ్మకాల ఒత్తిడి, కమొడిటీ ధరలు పుంజుకోవడం, కారణంగా వరుస మూడు రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లలోనూ దక్షిణ కొరియా కోస్పి దాదాపు 4 శాతం, జపాన్ నిక్కీ 225 సూచీ, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ సూచీ కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 503.76 పాయింట్లు క్షీణించి 83,313 వద్ద, నిఫ్టీ 133.20 పాయింట్లు పడిపోయి 25,642 వద్ద ముగిశాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 90.27 వద్ద ఉంది.






